WhatsApp eSIM: విదేశీ ప్రయాణాలు చేసే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే ఒక అద్భుతమైన శుభవార్త అందించనుంది. ఇప్పటివరకు ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ఇంటర్నెట్ వాడాలంటే అక్కడి ఎయిర్‌పోర్టుల్లో కొత్త లోకల్ సిమ్ కార్డులు కొనుక్కోవాల్సి వచ్చేది, లేదా వేల రూపాయలు పెట్టి ఖరీదైన ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌లు రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ ఇబ్బందికి శాశ్వత పరిష్కారం చూపుతూ మెటా సంస్థ వాట్సాప్‌లోనే నేరుగా eSIM డేటా ప్లాన్ కొనుగోలు చేసే సరికొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది.

1Global భాగస్వామ్యంతో సరికొత్త టెక్నాలజీ

వాట్సాప్ అప్‌డేట్లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే WABetaInfo నివేదిక ప్రకారం.. వాట్సాప్ సంస్థ 1Global అనే టెలికాం భాగస్వామితో కలిసి ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లోని ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.47.4 కోడ్‌లో ఈ అప్‌కమింగ్ ఫీచర్ తాలూకు ఆనవాళ్లు కనిపించాయి. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే వినియోగదారులు థర్డ్-పార్టీ యాప్‌లు లేదా వెబ్‌సైట్లకు వెళ్లకుండానే తమ వాట్సాప్ సెట్టింగ్స్ నుంచే నేరుగా అంతర్జాతీయ డేటా ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు.

వాట్సాప్ eSIM ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రయాణికులు తమ అవసరానికి తగ్గట్టుగా ఇంటర్నెట్ ప్లాన్‌లను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. తక్కువ డేటా వాడేవారి కోసం లిమిటెడ్ డేటా ప్లాన్స్, ఎక్కువగా ఇంటర్నెట్ ఉపయోగించే వారి కోసం అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు తాము వెళ్లే దేశం పేరును సెర్చ్ చేయడం ద్వారా లేదా పాపులర్ ట్రావెల్ డెస్టినేషన్లు, వివిధ ప్రాంతాల వారీగా ప్లాన్లను చూడవచ్చు. అంతేకాకుండా పలు దేశాల్లో పనిచేసే 'గ్లోబల్ డేటా ప్లాన్' ఆప్షన్ కూడా ఉండబోతోంది. ప్లాన్ కొనుగోలు చేయగానే eSIM సపోర్ట్ చేసే ఫోన్లలో వాట్సాప్ దాన్ని సులభంగా ఇన్‌స్టాల్ చేస్తుంది.

పాత సిమ్ తీయాల్సిన పనిలేదు

ఈ ఫీచర్‌లో ఉన్న అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఫోన్‌లో ఇప్పటికే ఉన్న మీ రెగ్యులర్ సిమ్ కార్డును బయటకు తీయాల్సిన అవసరం ఉండదు. ట్రావెల్ eSIM కేవలం ఇంటర్నెట్ డేటా కోసం విడిగా పనిచేస్తుండగా, మీ పాత మొబైల్ నంబర్ యథావిధిగా ఆన్‌లోనే ఉంటుంది. దీనివల్ల మీ పాత నంబర్‌కు వచ్చే ముఖ్యమైన కాల్స్, బ్యాంక్ ఓటీపీ మెసేజ్‌లను సులభంగా పొందవచ్చు. మీరు విదేశీ గడ్డపై అడుగుపెట్టి అక్కడి నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వగానే, కొనుగోలు చేసిన డేటా ప్లాన్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వాట్సాప్‌లో వస్తుంది.

ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?

ప్రస్తుతం ఈ eSIM డేటా ప్లాన్ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది. బీటా టెస్టర్లకు కూడా ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తయిన తర్వాత త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు వాట్సాప్ ఈ అప్‌డేట్‌ను విడుదల చేయనుంది.

Next Story