ఇకపై యాడ్స్ రాబోతున్నాయ్

WhatsApp Ads : ప్రపంచ వ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది వాట్సాప్ వాడుతుంటారు. ఫ్రెండ్స్‌తో చాట్ చేయడానికి ఇది బెస్ట్ యాప్. యూజర్లకు మెరుగైన అనుభవం కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంటుంది. కానీ, ఇప్పుడు మీ వాట్సాప్ వాడే 'మజా' కొద్దిగా మారబోతుంది. ఎందుకంటే, వాట్సాప్ లో త్వరలో యాడ్‌లు కనిపించబోతున్నాయి. వాట్సాప్ ప్రారంభమైనప్పటి నుంచి దాని సేవలు యూజర్లకు ఉచితంగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు కంపెనీ ఆదాయాన్ని పెంచుకోవడానికి పెయిడ్ ఫీచర్లు, యాప్‌లో ప్రకటనలు వంటి పెద్ద మార్పులు చేయబోతోందని తెలుస్తోంది. 2014లో మెటా ఈ యాప్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి, డబ్బు సంపాదించే దిశగా వాట్సాప్ తీసుకుంటున్న అతిపెద్ద అడుగు ఇదే.

ప్రతిరోజూ 1.5 బిలియన్ల కంటే ఎక్కువ మంది యూజర్లు వాట్సాప్ ఛానెల్స్, స్టేటస్ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ రెండు ఫీచర్‌లు కూడా వాట్సాప్ అప్‌డేట్ ట్యాబ్‌లో ఉంటాయి. త్వరలో ఈ అప్‌డేట్ ట్యాబ్‌లోనే ప్రకటనలు కూడా కనిపించనున్నాయి. కంపెనీ స్పష్టం చేసిన దాని ప్రకారం.. యూజర్లకు చాట్‌లు, కాల్స్, గ్రూప్‌లలో ప్రకటనలు కనిపించవు.

అప్‌డేట్ సెక్షన్‌లో కేవలం ప్రకటనలు మాత్రమే కాదు, పెయిడ్ ఛానెల్ సబ్‌స్క్రిప్షన్‌లు, ప్రమోట్ చేయబడిన ఛానెల్స్ కూడా అప్‌డేట్స్ ట్యాబ్‌లో కనిపిస్తాయి. అంటే, మీకు ఇష్టమైన క్రియేటర్లు లేదా సంస్థల ఛానెల్‌లకు మీరు సబ్‌స్క్రైబ్ చేసుకుని, కొన్ని ప్రత్యేకమైన అప్‌డేట్‌ల కోసం ప్రతి నెలా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ మార్పులు రాబోయే కొన్ని నెలల్లో యూజర్లకు యాప్‌లో నెమ్మదిగా కనిపించడం ప్రారంభిస్తాయి.

వాట్సాప్ ఈ పెద్ద మార్పును తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం క్రియేటర్లు, కంపెనీలకు యాప్ ద్వారా నేరుగా డబ్బు సంపాదించడానికి ఒక కొత్త మార్గాన్ని అందించడమే. ఇది క్రియేటర్లకు తమ కంటెంట్‌ను మోనిటైజ్ చేసుకోవడానికి, కంపెనీలకు తమ ఉత్పత్తులు/సేవలను నేరుగా టార్గెట్ ప్రేక్షకులకు చేరవేయడానికి అవకాశం ఇస్తుంది.

ఈ మార్పుల గురించి వినియోగదారుల ఆందోళనలను వాట్సాప్ అర్థం చేసుకుంది. అందుకే, ఈ మార్పులు అప్‌డేట్ ట్యాబ్‌కు మాత్రమే పరిమితం అని, వ్యక్తిగత మెసేజింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపవని వాట్సాప్ యూజర్లకు హామీ ఇచ్చింది.

వాట్సాప్‌ను మెటా (ఫేస్‌బుక్) కొనుగోలు చేసిన తర్వాత, దానిని ఎలా డబ్బు సంపాదించే ప్లాట్‌ఫామ్‌గా మార్చాలనే దానిపై చాలా చర్చ జరిగింది. ప్రపంచంలోనే అత్యధిక యూజర్లు ఉన్న మెసేజింగ్ యాప్‌లలో ఇది ఒకటి కాబట్టి, ప్రకటనల ద్వారా ఆదాయం పొందడం సహజమే. వాట్సాప్ బిజినెస్ యాప్, వాట్సాప్ పే వంటి ఫీచర్లతో ఇప్పటికే కొంత మోనిటైజేషన్ ప్రారంభించింది. ఇప్పుడు అప్‌డేట్ ట్యాబ్‌లో ప్రకటనలు, పెయిడ్ ఛానెల్స్ ద్వారా మరింత ఆదాయం సంపాదించాలని చూస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story