India GDP: ప్రపంచంలో భారత్ GDP స్థానం ఎంత?.. పార్లమెంట్లో కేంద్రం సంచలన ప్రకటన
పార్లమెంట్లో కేంద్రం సంచలన ప్రకటన

India GDP: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఏప్రిల్ 2026 నాటి వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదిక ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ నామినల్ జీడీపీ 3.92 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. ఈ గణాంకాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారతదేశం 6వ స్థానంలో నిలిచింది. రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇస్తూ.. డాలర్ మార్పిడి రేట్ల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లు మారుతుంటాయని, దేశ ఆర్థిక వ్యవస్థను $5 ట్రిలియన్ల దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
ఆర్థిక వృద్ధికి ప్రభుత్వ వ్యూహాత్మక ప్రణాళికలు
దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, తయారీ రంగాన్ని విస్తరించడానికి ప్రభుత్వం అనేక కీలక చర్యలు చేపట్టింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని విస్తరించడం, ఎంఎస్‌ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడం, పిఎమ్ గతిశక్తి, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ ద్వారా రవాణా వ్యయాన్ని తగ్గించడం వంటివి ఇందులో ప్రధానమైనవి. దీనితో పాటు ప్రభుత్వ క్యాపెక్స్, సరళమైన ఎఫ్‌డిఐ విధానాలు, జీఎస్టీ, ప్రత్యక్ష పన్నుల సంస్కరణల ద్వారా పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
బ్యాంకుల ఎన్ పీ ఏలు, ఫ్రాడ్ కేసుల్లో భారీ తగ్గుదల
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు గత మూడేళ్లలో గణనీయంగా మెరుగుపడ్డాయని కేంద్రం తెలిపింది.
* గ్రోస్ నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ (GNPAs): మార్చి 31, 2024 నాటికి రూ. 3,39,541 కోట్లుగా ఉన్న జీఎన్‌పీఏలు, మార్చి 31, 2026 నాటికి రూ. 2,45,634 కోట్లకు తగ్గాయి. జీఎన్‌పీఏ నిష్పత్తి 3.47% నుంచి 1.93% కి పడిపోయింది.
* బ్యాంకింగ్ మోసాలు : పిఎస్‌బిలలో నమోదైన ఫ్రాడ్ కేసులు 2023-24లో 54,850 ఉండగా, 2025-26 నాటికి అవి ఏకంగా 5,786 కి తగ్గాయి. గత మూడేళ్లలో బ్యాంకింగ్ మోసాలకు బాధ్యులైన 9,451 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, 5,147 కేసుల్లో ఉద్యోగుల బాధ్యతను ఖరారు చేశారు.
అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల లెక్కలు వెల్లడి
బ్యాంకింగ్ రంగంలో పేరుకుపోయిన అన్‌క్లెయిమ్డ్ ఫండ్స్ వివరాలను కూడా ఆర్‌బీఐ వెల్లడించింది. జూన్ 30, 2026 నాటికి ఆర్‌బీఐ వద్ద ఉన్న డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్‌లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం రూ. 86,917.08 కోట్లుగా ఉంది. ఖాతాదారులు లేదా వారి వారసులు సరైన ఆధారాలతో వస్తే డిపాజిట్లను తిరిగి చెల్లిస్తున్నారని, జూన్ 30, 2026 నాటికి డీఈఏ ఫండ్ నుంచి బ్యాంకులకు రూ. 17,414.68 కోట్ల క్లెయిమ్ మొత్తాన్ని ఆర్‌బీఐ రీయింబర్స్ చేసిందని మంత్రి పార్లమెంట్‌కు వివరించారు.

