వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ నుంచి పప్పుల ప్రస్తావన అవుట్

India-US Trade Pact : భారత్-అమెరికా మధ్య జరిగిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తన అధికారిక ఫ్యాక్ట్ షీట్‌లో కొన్ని కీలక మార్పులు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వివాదానికి కారణమైన పప్పు ధాన్యాల ప్రస్తావనను తొలగించడం, అలాగే 500 బిలియన్ డాలర్ల కొనుగోలుపై వాడిన పదజాలాన్ని మార్చడం గమనార్హం. భారత్‌లో రాజకీయ దుమారం రేగడంతో అమెరికా ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంది. భారత్-అమెరికా ఉమ్మడి ప్రకటన వెలువడిన తర్వాత, వైట్ హౌస్ విడుదల చేసిన మొదటి ఫ్యాక్ట్ షీట్‌లో కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి.. భారత్ అమెరికా నుంచి పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటుందని పేర్కొనడం. దీనిపై భారత్‌లోని విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ తీవ్రంగా మండిపడ్డాయి. "రైతుల పొట్ట కొట్టి అమెరికా పప్పులను దిగుమతి చేసుకుంటారా?" అని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ తన ఫ్యాక్ట్ షీట్‌ను సవరించింది. కొత్త షీట్ నుంచి పప్పు ధాన్యాల ప్రస్తావనను పూర్తిగా తొలగించింది.

అంతేకాదు, భారత్ అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేస్తుందనే విషయంలో గతంలో కమిట్మెంట్ అనే పదాన్ని వాడగా, ఇప్పుడు దానిని ఇంటెంట్గా మార్చింది. దీనివల్ల భారత్‌పై ఎటువంటి చట్టపరమైన లేదా అంతర్జాతీయ ఒత్తిడి ఉండదు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అంశంపై గట్టిగా ధ్వజమెత్తారు. ఫిబ్రవరి 6న విడుదలైన ఉమ్మడి ప్రకటనలో లేని పప్పు ధాన్యాల అంశం, ఫిబ్రవరి 9 నాటి వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్‌లో ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇది భారత రైతులను మోసం చేయడమేనని విమర్శించారు. అయితే, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విమర్శలను కొట్టిపారేశారు. భారత రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఏ ఒక్క ఒప్పందంపై సంతకం చేయలేదని వారు స్పష్టం చేశారు. సోయాబీన్, మొక్కజొన్న, గోధుమలు, పప్పు ధాన్యాలపై ఎలాంటి సుంకాల తగ్గింపు ఇవ్వలేదని వారు తేల్చి చెప్పారు.

వచ్చే కొన్ని వారాల్లో అమెరికా, భారత్ ఈ వాణిజ్య ఒప్పందాన్ని తుది రూపానికి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. అమెరికా పారిశ్రామిక వస్తువులు, వైన్, స్పిరిట్స్, కొన్ని ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించనుంది. ప్రతిగా అమెరికా కూడా భారతీయ వస్తువులపై రాయితీలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ మార్పుల ద్వారా భారత రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే, అమెరికాతో వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story