Energy Crisis: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీనివల్ల ఖతార్‌లోని ఎల్ఎన్జీ మౌలిక సదుపాయాలు ధ్వంసమై, సరఫరాలో దాదాపు 17 శాతం వరకు నిలిచిపోయింది. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే, ఎల్ఎన్జీ ధరలు రికార్డు స్థాయిలో ఏకంగా 26 డాలర్లకు చేరాయి. 2022 డిసెంబర్ తర్వాత ఈ స్థాయిలో గ్యాస్ ధరలు పెరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

చైనా, జపాన్ దేశాలలో తగ్గిన డిమాండ్

ఈ భారీ ధరల పెరుగుదల ఆసియా దేశాల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. చైనాలో గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో సెరామిక్స్, గ్లాస్ ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితి వచ్చింది. దీంతో చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి పెద్ద దేశాలు ఎల్ఎన్జీ దిగుమతులను భారీగా తగ్గించుకున్నాయి. కానీ, ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మాత్రం పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. ధరలు ఆకాశాన్నంటినప్పటికీ, దేశ అవసరాలరీత్యా భారత్ ఎక్కడా వెనకడుగు వేయకుండా నిరంతరం ఎల్ఎన్జీని కొనుగోలు చేస్తూనే ఉంది.

భారత్‌లో గ్యాస్ కొనుగోలు ఎందుకు ఆగడం లేదు?

భారతదేశంలో వినియోగించే మొత్తం గ్యాస్‌లో సుమారు 70 శాతం మేర కేవలం ఎరువుల (ఫెర్టిలైజర్) తయారీ రంగం, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ రంగాలకే అవసరమవుతుంది. వ్యవసాయ ఆధారిత దేశమైన మనకు ఎరువుల ఉత్పత్తి నిరంతరం సాగాలంటే గ్యాస్ అత్యంత కీలకం. అందుకే ప్రారంభంలో సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ, గెయిల్ వంటి సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతికి ఖతార్, యూఏఈల నుంచి సరఫరాను దాదాపు 90 నుంచి 95 శాతానికి పునరుద్ధరించాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోంది.

భవిష్యత్తులో గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉందా?

ఖతార్ గ్యాస్ సరఫరా తిరిగి సాధారణ స్థితికి వస్తే తప్ప 2027 నాటికి కూడా ధరలు పూర్తిగా తగ్గే సూచనలు కనిపించడం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరప్ దేశాలు తమ గ్యాస్ నిల్వలను మళ్లీ నింపుకోవాల్సి ఉండటంతో రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ, దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు ఇంధన సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలా చేస్తున్నాయి.

Next Story