Festive Season 2026 : పండుగల సీజన్‌కు ముందే అలర్ట్.. భారీగా బఫర్ స్టాక్ పెంచుతున్న భారతీయ కంపెనీలు
భారతీయ కంపెనీలు

Festive Season 2026 : భారతదేశంలో పండుగల సీజన్ అంటేనే మధ్యతరగతి కుటుంబాలలో షాపింగ్ సందడి మొదలవుతుంది. కేరళలో ఓనం, గణేష్ చతుర్థి నుంచి మొదలై అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చే దసరా, దీపావళి వరకు ఈ సేల్స్ జోరుగా సాగుతాయి. అయితే ఈ ఏడాది పండుగల సీజన్ ప్రారంభానికి ముందే భారతీయ కార్పొరేట్ రంగంలో పెద్ద ఆందోళన నెలకొంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, లాజిస్టిక్స్ సంక్షోభం కారణంగా మార్కెట్లో సరుకుల కొరత రాకుండా చూసేందుకు దేశంలోని ప్రముఖ కంపెనీలు ముందస్తుగా భారీ స్థాయిలో ముడిసరుకును, అవసరమైన భాగాలను స్టాక్ చేయడం ప్రారంభించాయి.
కంపెనీల్లో వార్-రూమ్ టెన్షన్
పశ్చిమ ఆసియా ప్రాంతంలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.96 కంటే దిగువకు పడిపోవడంతో కన్జ్యూమర్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. తమ సప్లై చైన్ దెబ్బతినకుండా ఉండేందుకు కంపెనీలు అత్యవసరంగా వార్-రూమ్ మోడ్‌లోకి వెళ్లాయి. చైనా నుంచి రావాల్సిన షిప్‌మెంట్లను గడువు కంటే ముందే తెప్పించుకుంటున్నాయి. ఫ్యాక్టరీలలో ఉత్పత్తి ఆగకుండా ఉండేందుకు వీలుగా దిగుమతి చేసుకునే విడిభాగాలు, పెట్రోకెమికల్ ఆధారిత ప్యాకేజింగ్ మెటీరియల్స్ బఫర్ స్టాక్‌ను ఏకంగా 20 శాతం వరకు పెంచేశాయి.
పార్లే నుంచి గోద్రెజ్ వరకు
భారతదేశంలో ఏటా జరిగే మొత్తం అమ్మకాలలో దాదాపు 30 శాతం వాటా ఈ పండుగల సీజన్ నుంచే వస్తుంది. అందుకే ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ పార్లే ప్రొడక్ట్స్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మెటీరియల్ ఆర్డర్లను 15 శాతం పెంచడమే కాకుండా, 10 శాతం అదనపు సిద్ధంగా ఉన్న వస్తువుల బఫర్‌ను మెయింటెన్ చేస్తోంది. ఇండస్ట్రియల్ ఎల్‌పీజీ లేదా ఇతర ఇంధన కొరత వచ్చినా సరుకు సరఫరా ఆగకూడదనేది వీరి ప్లాన్. అలాగే కాంప్లాన్, గ్లూకోన్-డి వంటి బ్రాండ్లను విక్రయించే జైడస్ వెల్‌నెస్ సంస్థ కూడా ధరలు అకస్మాత్తుగా పెరగడంతో 1 నుంచి 2 నెలలకు సరిపడా అదనపు ప్లాస్టిక్ ఇన్వెంటరీని సిద్ధం చేసుకుంటోంది.
సముద్ర మార్గాల్లో నిలిచిపోయిన ఓడలు
హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలు, సముద్ర మార్గాల్లో నెలకొన్న అస్థిరత వల్ల ఓడల ప్రయాణ సమయం భారీగా పెరిగింది. సాధారణంగా చైనా నుంచి భారతదేశానికి రావడానికి 22 నుంచి 30 రోజులు పట్టే ప్రయాణం, ఇప్పుడు ఓడలను ఇతర మార్గాల్లోకి మళ్లించడం వల్ల అంతకంటే ఎక్కువ సమయం పడుతోంది. ఉదాహరణకు కొడాక్, థామ్సన్ బ్రాండ్ల టీవీలను తయారు చేసే సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సంస్థకు మే నెలలో చైనాలోని షెన్‌జెన్ పోర్ట్ నుంచి బయలుదేరిన కన్సైన్‌మెంట్, సముద్రంలో రద్దీ వల్ల కరాచీ మీదుగా గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు రావాల్సి వచ్చింది. దీంతో పండుగ సీజన్ సరుకు ఆలస్యం కాకుండా ఉండటానికి కంపెనీలు తమ సప్లయర్లను 20 శాతం అదనపు స్టాక్ పంపాలని కోరుతున్నాయి.
గోదాములు రెంట్లకు తీసుకుంటున్న దిగ్గజ సంస్థలు
ఎల్‌జీ, వోల్టాస్, వర్ల్‌పూల్, డైకిన్ వంటి 60 కి పైగా బ్రాండ్లకు విడిభాగాలను తయారు చేసే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, గోద్రెజ్ అప్లయెన్సెస్ వంటి సంస్థలు ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. సప్లై చైన్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడినా మార్కెట్లో వస్తువుల లభ్యత తగ్గిపోతుందని ఈ సంస్థల అధినేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ముడిసరుకును, తయారైన వస్తువులను సురక్షితంగా దాచడానికి కంపెనీలు అదనంగా గోదాములను అద్దెకు తీసుకుంటున్నాయి. అయితే ఈ అదనపు ఏర్పాట్ల వల్ల కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని, దీని ప్రభావం భవిష్యత్తులో వస్తువుల ధరలపై పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

