PM Surya Ghar Yojana : ఒక్కసారి చేసుకుంటే జీవితాంతం కరెంట్ ఫ్రీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే
ఎలా అప్లై చేసుకోవాలంటే

PM Surya Ghar Yojana : దేశాన్ని విద్యుత్ విషయంలో ముందుంచాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది. దీనికి చాలా రాష్ట్రాల్లో మంచి స్పందన లభిస్తోంది. అయితే, కర్ణాటకతో పాటు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో మాత్రం ఈ పథకానికి పెద్దగా ఆదరణ దక్కడం లేదు. ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకునే ఈ పథకానికి, ఈ మూడు రాష్ట్రాల నుంచి 5% కన్నా తక్కువ దరఖాస్తులు మాత్రమే వచ్చాయని అధికారిక డేటా చెబుతోంది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11.4 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ అమర్చారు. అంటే, మొత్తం దరఖాస్తుల్లో 24.4% మందికి సోలార్ ప్యానెల్స్ బిగించారు. గుజరాత్‌లో ఈ కన్వర్షన్ రేట్ 75% కన్నా ఎక్కువగా ఉంది. కానీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి 6 రాష్ట్రాల్లో మాత్రం ఈ రేట్ చాలా తక్కువగా ఉందని డేటా వెల్లడిస్తోంది.
పీఎం సూర్య ఘర్ యోజన అనేది ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని, వాటి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే పథకం. దీని ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ పథకం కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ఖర్చులో 60% వరకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. 2 కిలోవాట్ల వరకు 60% సబ్సిడీ, ఆపైన 3 కిలోవాట్ల వరకు అదనపు యూనిట్లకు 40% సబ్సిడీ లభిస్తుంది. 3 కిలోవాట్ల వరకు గరిష్టంగా రూ. 78,000 సబ్సిడీ వస్తుంది. ఈ పథకానికి చాలా చోట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నప్పటికీ, దరఖాస్తు చేసుకున్న వారికి సోలార్ ప్యానెల్స్ బిగించే శాతం మాత్రం కొన్ని కారణాల వల్ల తక్కువగా ఉంది.
పీఎం సూర్య ఘర్ యోజనకు అర్హతలు ఏంటి?
* మీరు నివసించే ఇల్లు బిల్డింగ్ అయి ఉండాలి.
* ఇంటిపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి అనువుగా పైకప్పు ఉండాలి.
* మీ పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉండాలి.
పీఎం సూర్య ఘర్ యోజనకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
* ముందుగా పీఎం సూర్య ఘర్ యోజన వెబ్‌సైట్‌కు (pmsuryaghar.gov.in/) వెళ్ళండి.
* అక్కడ "Apply for Rooftop Solar" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* మీ DISCOM (విద్యుత్ సరఫరా సంస్థ), మీ కన్స్యూమర్ నంబర్ వంటి వివరాలను నింపి మీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి.
* ఇప్పుడు లాగిన్ అవ్వండి.
* దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా నింపండి.
* విద్యుత్ బిల్లు, ఆస్తి పన్ను రసీదు వంటి యాజమాన్య పత్రాలను అప్‌లోడ్ చేయండి.
* అన్నీ నింపిన తర్వాత, DISCOM అనుమతి కోసం దరఖాస్తును సమర్పించండి.
మీ దరఖాస్తు సమర్పించిన తర్వాత, స్థానిక విద్యుత్ బోర్డు దాన్ని పరిశీలించి, అన్నీ సరిగ్గా ఉంటే ఆమోదిస్తుంది. మీకు SMS లేదా ఇమెయిల్ ద్వారా సమాచారం వస్తుంది.
అనుమతి వచ్చిన తర్వాత, మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమర్చే పని మొదలవుతుంది. దాని కోసం, మీరు పోర్టల్‌లో నమోదైన విక్రేతలలో ఒకరిని సంప్రదించి, సోలార్ ప్యానెల్స్ బిగించుకోవచ్చు. వాళ్ళు వచ్చి ప్యానెల్స్, అవసరమైతే ఇన్వర్టర్, బ్యాటరీ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత నెట్ మీటర్ను బిగిస్తారు. సోలార్ ప్యానెల్స్ అమర్చిన తర్వాత, వాటి ఫోటోను తీసి అప్‌లోడ్ చేయాలి. విక్రేత ఇచ్చిన బిల్లు, ఇతర వివరాలను కూడా సమర్పించాలి. చివరగా, DISCOM అధికారులు వచ్చి పరిశీలించి, ఆమోదం తెలుపుతారు. ఆమోదం లభించిన తర్వాత, సబ్సిడీ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జమ అవుతుంది.
