Food Safety: ప్యాకేజ్డ్ జంక్ ఫుడ్‌పై కంపెనీల కుట్ర.. సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్
సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

Food Safety: విదేశాల్లో కఠిన నిబంధనలు పాటించే మల్టీనేషనల్ కంపెనీలు భారత్‌లో ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ఎర్రటి హెచ్చరిక లేబుళ్లు వేసేందుకు నిరాకరిస్తున్నాయి. ఈ ద్వంద్వ వైఖరిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లండన్‌లో విక్రయించే ఫాంటా ఒక క్యాన్‌లో కేవలం 63 క్యాలరీల చక్కెర ఉంటే, అదే బ్రాండ్‌ను భారతదేశంలో కొనుగోలు చేస్తే ఏకంగా మూడు రెట్లు ఎక్కువ చక్కెర ఉంటోంది. ఐరోపాలో ఏదైనా పానీయంలో కృత్రిమ రంగులు వాడితే ప్యాకెట్ ముందు భాగంలో పెద్ద ఆరోగ్య హెచ్చరిక వేయడం తప్పనిసరి. కానీ భారత్‌లో మాత్రం ఆ విషయాలను ప్యాకెట్ వెనుక భాగంలో అతి చిన్న అక్షరాలతో ముద్రిస్తున్నారు. కోకకోలా, నెస్టే వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు మన దేశంలో ఉన్న ఆహార భద్రత లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని ఎకనామిక్ టైమ్స్ కథనం స్పష్టం చేసింది.
వార్నింగ్ లేబుళ్ల వివాదం
యూరోప్‌లోని దాదాపు రెండు డజన్ల దేశాల్లో ప్యాకెట్లపై ట్రాఫిక్-లైట్ (రెడ్, యెల్లో, గ్రీన్) పద్ధతిలో హెచ్చరిక లేబుళ్లను సంతోషంగా వేసే ఈ కంపెనీలు, భారత్‌లో మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆగస్టులో భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ (FSSAI) ప్యాకెట్ల ముందు భాగాన ఎరుపు లేదా పచ్చటి రంగు హెచ్చరికలను ముద్రించే నిబంధనను పక్కన పెట్టింది. భారతీయ ఆహార శైలి పాశ్చాత్య దేశాల కంటే భిన్నంగా ఉంటుందని చెబుతూ, ఎరుపు రంగు హెచ్చరికలకు బదులుగా కేవలం నలుపు-తెలుపు పట్టికలో షుగర్, ఫ్యాట్, ఉప్పు శాతాలను ముద్రించాలని ప్రతిపాదించింది.
కంపెనీల భయం, మార్కెట్ ప్రభావం
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. FSSAI అధికారులతో జరిగిన సమావేశంలో ఫుడ్ ఇండస్ట్రీ ప్రతినిధులు విచిత్రమైన వాదనలు వినిపించారు. ప్యాకెట్ల ముందు భాగంలో ఎరుపు రంగు మార్క్ లేదా హెచ్చరికలు ఉంటే వినియోగదారులు అయోమయానికి గురవుతారని, దీనివల్ల భారతదేశంలో లభించే 80 శాతానికి పైగా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు Dangerous అనే కేటగిరీలోకి వెళ్లిపోతాయని భయపడ్డారు. ఈ వ్యాపార ఒత్తిళ్ల కారణంగానే FSSAI తన మునుపటి నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
సుప్రీం కోర్టు కఠిన వైఖరి
ఈ వ్యవహారంపై హెల్త్ యాక్టివిస్టులు వేసిన పిటిషన్‌తో సుప్రీం కోర్టు రంగంలోకి దిగింది. FSSAI నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ.. భారత పౌరుల ఆరోగ్యం పట్ల దేశానికి శ్రద్ధ ఉందనే విషయాన్ని ప్రపంచం మొత్తానికి స్పష్టంగా తెలియజేయాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఒక అధ్యయనం ప్రకారం 2050 నాటికి దాదాపు 45 కోట్ల మంది భారతీయులు ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉంది. ఫుడ్ ఫార్మర్ (రేవంత్ హిమాత్‌సింకా) వంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా భారత్‌లో అమ్మే మ్యాగీ (పామ్ ఆయిల్ వాడకం), కిట్‌క్యాట్ క్వాలిటీ యూకేతో పోలిస్తే ఎంత అధ్వానంగా ఉందో ఎండగడుతున్నారు. తీవ్ర ఒత్తిడి రావడంతో నెస్టే సంస్థ ఇటీవలే 50 ఏళ్ల తర్వాత భారత్‌లో షుగర్ ఫ్రీ సెరెలాక్ అమ్మడం ప్రారంభించింది.

