AI Jobs Impact: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక దిగ్గజాలు భవిష్యత్తులో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నప్పటికీ, ఆర్థిక నిపుణులు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాంకేతికత రాక వల్ల ఉన్న ఉద్యోగాలు రద్దయిపోవని, పనిచేసే పద్ధతుల్లో మాత్రమే మార్పులు వస్తాయని స్పష్టం చేస్తున్నారు.

74 రీసెర్చ్ నివేదికల్లో ఏం తేలింది?

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఏఐ, ఉపాధి అవకాశాలపై జరిగిన 74 అధ్యయన నివేదికలను విశ్లేషించింది. ఈ పరిశోధనల్లో ఏఐ వల్ల ఉద్యోగాల సంఖ్య 20 శాతం తగ్గవచ్చని కొందరు, మరికొందరు 25 శాతం పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. ఒక్కో నివేదిక ఒక్కో రకమైన అంచనా వేయడం వల్ల ఏఐ వల్ల ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలు పోతాయో చెప్పడం సాధ్యం కాదని తేలింది. కంప్యూటర్లు, ఆటోమేషన్ వచ్చిన సమయంలో కూడా ఇలాగే ఉద్యోగాలు పోతాయని భయపడ్డారని, కానీ ఆ ఊహాగానాలు నిజం కాలేదని నోబెల్ గ్రహీత క్రిస్టోఫర్ పిసారైడ్స్ గుర్తుచేశారు.

ఒక ఉద్యోగం.. ఎన్నో రకాల బాధ్యతలు

ఆర్థిక నిపుణులు ప్రధానంగా ఒక విషయాన్ని వివరిస్తున్నారు. ప్రతి ఉద్యోగంలోనూ వేర్వేరు రకాల పనులు ఉంటాయి. ఏఐ వీటిలో డేటా విశ్లేషణ లేదా ప్రజెంటేషన్లు తయారుచేయడం వంటి కొన్ని పనులను సులభతరం చేయగలదు. అంతమాత్రాన ఆ ఉద్యోగమే లేకుండా పోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. క్లయింట్లతో మాట్లాడటం, ప్రతిపాదనలను అమలు చేయడం వంటి కీలకమైన బాధ్యతలకు మానవ మేధస్సు, అనుభవం తప్పనిసరిగా అవసరమవుతాయి.

13 దేశాల సర్వేలో కీలక విషయాలు

OECD నిర్వహించిన సర్వేలో ఏఐ ఉపయోగిస్తున్న 10 కంపెనీల్లో ఒక కంపెనీ మాత్రమే ఉద్యోగులను తగ్గించినట్లు తెలిపింది. కేవలం 1 శాతం కంపెనీలు మాత్రమే ఏఐ కారణంగా సిబ్బందిని తొలగించామని పేర్కొన్నాయి. అయితే సాఫ్ట్‌వేర్ రంగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల భర్తీ కాస్త నెమ్మదించడం నిజమేనని ఒప్పుకుంటున్నారు. సీనియర్ ఉద్యోగులు ఏఐ సాయంతో జూనియర్లు చేసే సాధారణ పనులను కూడా త్వరగా పూర్తి చేయడమే ఇందుకు కారణమని అంచనా వేస్తున్నారు.

కొత్త అవకాశాలు.. పెరుగుతున్న వ్యత్యాసాలు

ఏఐ కొన్ని సాంప్రదాయ ఉద్యోగాల అవసరాన్ని తగ్గించినప్పటికీ, డేటా సెంటర్లు, ఏఐ ఇంజనీరింగ్ వంటి సరికొత్త రంగాల్లో వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. న్యాయ, వైద్య, విద్యా రంగాల్లో నాణ్యమైన సేవలు తక్కువ ధరకే లభించే వెసులుబాటు కలుగుతుంది. సాంకేతికత వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాలు కొందరికే పరిమితం కాకుండా, అందరికీ సమానంగా అందేలా ప్రభుత్వాలు సరైన విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉంది.

Next Story