Gold Price: భారతీయ వస్తు మార్కెట్లో గత కొన్ని వారాలుగా బంగారం అలాగే వెండి ధరలు ఊహించని విధంగా భారీగా పడిపోతున్నాయి. అక్టోబర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు పరిశీలిస్తే పసిడి ధరలు దాదాపు 6.63 శాతం మేర క్షీణించగా, వెండి ధరలు ఏకంగా 10 శాతానికి పైగా కుప్పకూలాయి. దీపావళి పండుగ సమయానికి గరిష్ట స్థాయికి చేరిన ధరలు ఆ తర్వాత నుంచి నిరంతరం తగ్గుముఖం పట్టాయి. నిన్నటి ట్రేడింగ్‌లో బంగారం ధర రూ.1.35 లక్షల దిగువకు పడిపోగా, వెండి ధర రూ.1.70 లక్షల స్థాయిని కోల్పోయి మరింత దిగజారింది. ఈ అనూహ్య ధరల పతనం సామాన్య ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ధరలు పడిపోవడానికి కారణాలు ఏమిటి?

బంగారం, వెండి ధరలు అంతలా పడిపోవడానికి ప్రధానంగా కొన్ని ఆర్థిక అంశాలు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం, ఫెడరల్ రిజర్వ్ అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ రాబోయే సమావేశాలలో వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందనే అంచనాలు మార్కెట్‌ను శాసిస్తున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ ఇండెక్స్ బలపడటం, విదేశీ పెట్టుబడిదారులు తిరిగి భారతీయ మార్కెట్ల వైపు మొగ్గు చూపడంతో రూపాయి మారకం విలువ పుంజుకోవడం వంటి పరిణామాలు పసిడిపై తీవ్ర ఒత్తిడిని తెస్తున్నాయి.

బంగారం ధర రూ.లక్షకు పడిపోయే అవకాశం ఉందా?

ప్రస్తుతం వినియోగదారుల మెదళ్లను తొలుస్తున్న అతిపెద్ద ప్రశ్న 'బంగారం ధర మళ్లీ లక్ష రూపాయలకు వస్తుందా' అనేదే. దీనిపై ఆర్థిక నిపుణులు స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది ముగిసేలోపు బంగారం ధర లక్ష రూపాయల స్థాయికి పడిపోవడం చాలా కష్టమని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత స్థాయి నుంచి లక్ష రూపాయలకు రావాలంటే దాదాపు 26 శాతం పతనం కావాల్సి ఉంటుంది. అయితే అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పారిశ్రామిక డిమాండ్ అలాగే సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల ఆధారంగా రాబోయే రోజుల్లో బంగారం ధర రూ.1.15 లక్షల నుంచి రూ.1.25 లక్షల శ్రేణిలో కదలాడే అవకాశం ఉంది. అలాగే వెండి ధర రూ.1.40 లక్షల నుంచి రూ.1.60 లక్షల మధ్య ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

ధరలను ప్రభావితం చేసే అంశాలు

రాబోయే కాలంలో పసిడి, వెండి ధరల గమనాన్ని కొన్ని కీలక పరిణామాలు నిర్దేశించనున్నాయి. అమెరికా ఫెడ్ బ్యాంక్ తీసుకునే వడ్డీ రేట్ల నిర్ణయాలు, గ్లోబల్ మార్కెట్లో డాలర్ కదలికలు, వివిధ దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండికి ఉన్న పారిశ్రామిక డిమాండ్ కూడా దాని ధరల తీరుతెన్నులను మారుస్తుంది. కాబట్టి ఆభరణాలు లేదా పెట్టుబడుల కోసం ప్లాన్ చేసుకునే వారు ఈ ట్రెండ్స్‌ను గమనించడం చాలా ముఖ్యం.

Next Story