అన్నదాతల ఆశలు నెరవేరేనా?

Budget 2026 : ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ 2026 పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతల చూపు ఇప్పుడు ఢిల్లీ వైపు మళ్లింది. ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇచ్చే వార్షిక సాయం పెంపుపై రైతాంగంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని ఏళ్లుగా పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఈ సారి రైతులకు బడ్జెట్ బొనాంజా ప్రకటిస్తుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా వ్యవసాయ రంగానికి కేటాయించే బడ్జెట్ నిధులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. 2013-14లో కేవలం రూ. 21,933 కోట్లుగా ఉన్న వ్యవసాయ బడ్జెట్, 2025-26 నాటికి ఏకంగా రూ. 1.27 లక్షల కోట్లకు చేరింది. రాబోయే 2026-27 బడ్జెట్‌లో ఈ కేటాయింపులు రూ. 1.50 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిధుల్లో ప్రధాన భాగం పీఎం కిసాన్, ఫసల్ బీమా యోజన వంటి పథకాలకే వెళ్తుంది. అందుకే ఈసారి బడ్జెట్‌లో పీఎం కిసాన్ నిధులను రూ. 6,000 నుండి రూ. 12,000లకు పెంచుతారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.

ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం ద్వారా సుమారు 9 నుంచి 10 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. వీరికి ఏడాదికి మూడు విడతల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 అందుతున్నాయి. ప్రభుత్వం ఒక్కో విడతకు దాదాపు రూ.20,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఒకవేళ ఈ మొత్తాన్ని రెట్టింపు చేస్తే, ప్రభుత్వంపై ఏటా అదనంగా రూ.60,000 కోట్ల భారం పడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ దృష్ట్యా ప్రభుత్వం నిధులు పెంచడం కష్టమని కొందరు అంటుంటే, కనీసం విడతల సంఖ్యను పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంటే ఏడాదికి మూడు సార్లకు బదులు నాలుగు సార్లు నగదు జమ చేసే అవకాశం ఉంది.

రైతుల మనసు గెలుచుకోవాలంటే సాగు పెట్టుబడి సాయం పెంచడం ఒక్కటే మార్గమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల ధరలు విపరీతంగా పెరిగిన తరుణంలో రూ. 6,000 సాయం ఏ మూలకు సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం, అగ్రి-టెక్ స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి చర్యలపై కూడా బడ్జెట్‌లో ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో అర్హులైన కౌలు రైతులను చేర్చే అంశంపై కూడా ప్రభుత్వం ఏదైనా స్పష్టత ఇస్తుందేమోనని అన్నదాతలు ఆశగా చూస్తున్నారు.

ఇక 22వ విడత నిధుల విషయానికి వస్తే, గత 21వ విడత నిధులను నవంబర్ 2025లో విడుదల చేశారు. సాధారణంగా నాలుగు నెలల వ్యవధిలో వచ్చే ఈ నిధులు, ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే లేదా బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ రోజే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయడం ద్వారా సానుకూల సంకేతాలు పంపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో రైతుల కోసం ఏ పిడుగు లాంటి వార్త చెబుతారో, లేక ఏదైనా బంపర్ ఆఫర్ ఇస్తారో వేచి చూడాల్సిందే.

PolitEnt Media

PolitEnt Media

Next Story