RBI Repo Rate: దేశంలో మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉల్లి ధరలు రెట్టింపు కావడం, పప్పుధాన్యాలు, బియ్యం, పాలు వంటి నిత్యవసర వస్తువుల ధరలు పైకికెక్కిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు వాతావరణంలో వస్తున్న మార్పులు, ఎల్ నినో ముప్పు మునుముందు మరింత ప్రమాదకరంగా మారేలా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాబోయే డిసెంబర్ నెలలో వడ్డీ రేట్లను మరోసారి పెంచే అవకాశం ఉందనే చర్చ ఆర్థిక వర్గాల్లో తీవ్రంగా జరుగుతోంది.

ఆరు శాతానికి చేరనున్న రిటైల్ ద్రవ్యోల్బణం

అక్టోబర్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ అధికారిక గణాంకాలు త్వరలో వెలువడనున్నాయి. గత సెప్టెంబర్ నెలలో ద్రవ్యోల్బణం 5.54 శాతంగా నమోదు కాగా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం అక్టోబర్‌లో ఇది ఏకంగా 6 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఆర్బీఐకి ఇది తీవ్ర తలనొప్పిగా మారనుంది. డిసెంబర్ 2 నుంచి 4 వరకు జరగనున్న మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఈ గణాంకాలే అత్యంత కీలకం కానున్నాయి.

రెట్టింపు అయిన ఉల్లి ధరలు

గత ఏడాది కాలంతో పోలిస్తే ఉల్లి ధరలు ఏకంగా 99.6 శాతం వరకు పెరిగిపోయాయి. టమోటా, కందిపప్పు, మినపప్పు, పాలు, వంటనూనెలు వంటి నిత్యవసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం అక్టోబర్‌లో ముఖ్యాంశమైన ఇరవై వస్తువుల ధరలు 11.1 శాతం పెరిగాయి. కూరగాయలు పండించే రాష్ట్రాల్లో సరైన వర్షాలు పడకపోవడం, ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలు మార్కెట్లో ధరల మంటను మరింత రాజేస్తున్నాయి.

అల్ నినో ముప్పుతో వ్యవసాయ రంగంపై ఆందోళన

వాతావరణ పరిస్థితులు కూడా ద్రవ్యోల్బణాన్ని పెంచేలా మారుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం రబీ పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలోని జలాశయాల్లో నీటి మట్టాలు గత ఏడాదితో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచ వాతావరణ సంస్థ రాబోయే కాలంలో బలమైన అల్ నినో ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇది ఉష్ణోగ్రతలను విపరీతంగా పెంచి ఆహారధాన్యాల ఉత్పత్తిని దెబ్బతీసే ప్రమాదం ఉంది.

డిసెంబర్‌లో రెపో రేటు పెరిగితే ఈఎంఐల మోత

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే అక్టోబర్‌లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. ప్రస్తుత ధరల పెరుగుదల ధోరణి ఇలాగే కొనసాగితే, డిసెంబర్ సమావేశంలో ఆర్బీఐ మరోసారి రెపో రేటును 0.25 శాతం పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర బ్యాంకు గనుక ఈ నిర్ణయం తీసుకుంటే హోమ్ లోన్లు, ఆటో లోన్లు తీసుకున్న సామాన్యులపై నెలవారీ ఈఎంఐ భారం మరింత భారీగా పెరగనుంది.

Next Story