బడ్జెట్ 2026లో అగరు సాగుకు బంపర్ ఆఫర్

Budget 2026 : బడ్జెట్ 2026-27లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు సరికొత్త వ్యూహాలను ప్రకటించింది. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల కోసం ఏకంగా రూ.1,62,671 కోట్లు కేటాయించారు. అయితే ఈసారి అందరి దృష్టిని ఆకర్షించిన ఒక ప్రత్యేక అంశం అగరు చెక్క సాగు. ఈ చెట్టు కలప బంగారం కంటే ఖరీదైనదని తెలుసా? ఈశాన్య రాష్ట్రాల్లో అగరు సాగును ప్రోత్సహించడం ద్వారా రైతుల తలరాత మార్చాలని కేంద్రం నిర్ణయించింది.

అగరు చెక్కను లిక్విడ్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా అక్విలేరియా రకానికి చెందిన చెట్టు ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు లేదా దానికి ఏదైనా గాయం అయినప్పుడు, ఆ చెట్టు తనను తాను రక్షించుకోవడానికి ఒక రకమైన జిగురు వంటి ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ జిగురు వల్లే ఆ చెక్క నలుపు రంగులోకి మారి అద్భుతమైన సువాసనను వెదజల్లుతుంది. దీనినే మనం ఊద్ అని పిలుస్తాం. ఈ ప్రక్రియ సహజంగా జరగడానికి చాలా సమయం పడుతుంది, అందుకే దీనికి అంతటి డిమాండ్.

ధరల విషయానికి వస్తే.. అగరు చెక్క విలుక ఏకంగా కిలో రూ.70 లక్షల వరకు పలుకుతుంది. దీని నుంచి తీసిన ఊద్ ఆయిల్ ఒక గ్రాము ధర సుమారు రూ.9 వేల వరకు ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పెర్ఫ్యూమ్స్ తయారీలో ఈ నూనెను వాడతారు. అరబ్ దేశాల్లో దీనికి విపరీతమైన క్రేజ్ ఉంది. అంతేకాకుండా చైనా, భారత్ వంటి దేశాల్లో ఆయుర్వేద, సాంప్రదాయ వైద్యంలో కూడా అగరును శతాబ్దాలుగా వాడుతున్నారు.

భారతదేశంలో అగరు చెట్లు సహజంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో పెరుగుతాయి. అయితే బడ్జెట్ 2026లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇకపై కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ వంటి పశ్చిమ తీర ప్రాంతాల్లో కూడా దీని సాగు ఊపందుకోనుంది. ఈ చెట్టు సుమారు 21 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తే, తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. సుగంధ ద్రవ్యాల పరిశ్రమలో భారత్ ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఈ అగరు సాగు ఒక వరం లాంటిదని బడ్జెట్ లో స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story