GDP : భారత ఆర్థిక వ్యవస్థకు గుడ్‌న్యూస్.. జీడీపీ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంకు
జీడీపీ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంకు

GDP : ప్రపంచ ఆర్థిక వేదికపై భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమెరికా విధించిన టారిఫ్‌ల ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థ కొంత నష్టపోతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేసినప్పటికీ, దానికి భిన్నంగా భారత జీడీపీ బలంగా ముందుకు సాగుతోంది. తాజాగా ప్రపంచ బ్యాంకు తన అంచనాలను పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి 6.5% ఉంటుందని అంచనా వేసింది. ఇదివరకు ఇచ్చిన రిపోర్టులో 6.3% వృద్ధి ఉంటుందని ప్రపంచ బ్యాంకు చెప్పింది.
వృద్ధికి ముఖ్య కారణాలు ఏంటి?
అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఉన్నా, భారత్ ఇంత వేగంగా ఎదగడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు తన దక్షిణ ఆసియా దేశాల నివేదికలో ఈ అంశాలను పేర్కొంది. దేశీయంగా వస్తువుల కొనుగోలు, వినియోగం బలంగా ఉంది. గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరగడం కూడా వృద్ధికి ఒక కారణం. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తి, గ్రామీణ వేతనాలు పెరిగాయి. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీఎస్‌టీ సంస్కరణల ద్వారా పన్ను రేట్లు తగ్గడం, ఆర్థిక కార్యకలాపాలు పెరగడానికి సహాయపడుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
టారిఫ్‌ల ప్రభావం ఎప్పుడు?
అమెరికా విధించిన టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై ఖచ్చితంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అయితే, ఈ ప్రభావం ప్రస్తుత సంవత్సరంలో కాకుండా, ఆ తరువాత వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026-27) ఎక్కువగా ఉండవచ్చు. అందుకే, ప్రపంచ బ్యాంకు ఆ సంవత్సరానికి సంబంధించిన జీడీపీ వృద్ధి అంచనాను 6.50% నుంచి 6.30% కి తగ్గించింది. అంటే, ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండవచ్చని ప్రపంచ బ్యాంకు అభిప్రాయం.
నిన్నటి వృద్ధి రేటు అద్భుతం
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) లో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7.8% గా నమోదైంది. చాలామంది ఆర్థిక నిపుణులు ఈ కాలంలో వృద్ధి కేవలం 6.5% నుంచి 7% మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. ఈ అనూహ్య వృద్ధి ఆర్థిక నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. దీనికి ముందు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.4% గా నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల ప్రకారం కూడా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ 6.8% పెరిగే అవకాశం ఉంది.
