Worlds Costliest Rose: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జూలియట్ రోజ్ ధర ఎంతో తెలిస్తే కళ్లు తిరిగి పడడం ఖాయం
జూలియట్ రోజ్ ధర ఎంతో తెలిస్తే కళ్లు తిరిగి పడడం ఖాయం

Worlds Costliest Rose: సాధారణంగా మనకు మార్కెట్‌లో ఒక గులాబీ పువ్వు కావాలంటే పది లేదా ఇరవై రూపాయలు ఇస్తే వచ్చేస్తుంది. మహా అయితే ప్రేమికుల రోజు లాంటి సందర్భాల్లో ఒక వంద రూపాయలు ఉండవచ్చు. కానీ, ప్రపంచంలో కొన్ని రకాల గులాబీలు ఉన్నాయి.. వాటి ధర వింటే మీ గుండె ఆగిపోవాల్సిందే. ఒక్క పువ్వు ధరతో ఒక లగ్జరీ విల్లా కొనేయొచ్చు, లేదా జీవితాంతం కూర్చుని తినేయొచ్చు. మన దేశంలో కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో రైతులు ఎంతో కష్టపడి రంగురంగుల గులాబీలను పండిస్తుంటారు. పాలీహౌస్‌లు, డ్రిప్ ఇరిగేషన్ వాడి మేలైన హైబ్రిడ్ రకాలను పెంచుతారు. కానీ ప్రపంచ దేశాల్లోని కొన్ని అరుదైన గులాబీల ధరలు కోట్లలో పలుకుతున్నాయి. ఇందులో టాప్ ప్లేస్‌లో ఉండేది జూలియట్ రోజ్. దీని ధర అక్షరాలా 130 కోట్ల రూపాయలు.
ప్రఖ్యాత బ్రీడర్ డేవిడ్ ఆస్టిన్ ఈ జూలియట్ రోజ్‌ను సృష్టించడానికి ఏకంగా 15 ఏళ్ల పాటు శ్రమించారు. 2006లో ఈ పువ్వును ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు దాని ధర చూసి అందరూ నోరెళ్లబెట్టారు. అప్రికాట్ (ఖర్జూరం లాంటి రంగు) రంగులో మెరిసిపోయే ఈ పువ్వు, విచ్చుకున్నప్పుడు ఒక కప్పు ఆకారంలో కనిపిస్తుంది. దీని సువాసన కూడా చాలా ప్రత్యేకం. అప్పట్లో దీనిని 15.8 మిలియన్ డాలర్లకు విక్రయించారంటే ఇది ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు.
జూలియట్ రోజ్ తర్వాత అంత ఖరీదైనవి కాకపోయినా, సామాన్యులకు అందనంత ధరలో మరికొన్ని రకాలు ఉన్నాయి. లూయిస్ XIV అనే గులాబీ పువ్వు గాఢమైన ఊదా రంగులో ఉంటుంది. దీని ధర ఒక్క పువ్వుకే రూ.5,000 నుంచి రూ.9,000 వరకు ఉంటుంది. అలాగే బ్లాక్ బక్కారా అనే గులాబీ చూడ్డానికి నలుపు రంగులో ఉండి మఖ్మల్ (వెల్వెట్) క్లాత్‌లా మెరుస్తుంది. దీని ధర కూడా వేలల్లోనే ఉంటుంది.
గులాబీ ప్రియుల కోసం కాఫీ బ్రేక్ రోజ్ అనే వెరైటీ కూడా ఉంది. ఇది ఒక రకమైన కాఫీ రంగులో ఉండి చాలా కాలం పాటు వాడిపోకుండా ఉంటుంది. దీని ధర సుమారు రూ.8,000 వరకు పలుకుతుంది. ఇక పెద్ద సైజులో మెరిసిపోయే గులాబీ రంగులో ఉండే పింక్ ఫ్లాయిడ్ గులాబీ ధర రూ.5,000 నుంచి రూ.7,500 వరకు ఉంటుంది. ఇవి అరుదుగా దొరికే రకాలు కాబట్టి, ధనవంతులు తమ ప్రత్యేక వేడుకల్లో వీటిని అలంకరించడానికి పోటీ పడుతుంటారు.

