Gold Vault : భూమికి 80 అడుగుల లోతులో వేల టన్నుల బంగారం.. ప్రపంచంలో అతిపెద్ద ఖజానా ఉన్న దేశం ఏదో తెలుసా ?
ప్రపంచంలో అతిపెద్ద ఖజానా ఉన్న దేశం ఏదో తెలుసా ?

Gold Vault : ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. బంగారాన్ని అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నందున, అనేక దేశాలు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అయితే, ఈ దేశాలు కొన్న బంగారాన్ని ఎక్కడ ఉంచుతాయో మీకు తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సురక్షితమైన ఖజానాలో ఈ దేశాలు తమ బంగారాన్ని నిల్వ చేస్తాయి. ఈ ఖజానా అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని మ్యాన్‌హట్టన్‌లో ఉంది. ఇది ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ ఖజానా.
ఈ ఖజానాను 1920లలో నిర్మించారు. ఇది భూమికి 80 అడుగుల లోతులో, సముద్ర మట్టానికి 50 అడుగుల దిగువన ఉంది. ఈ ఖజానా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ బంగారం భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. బంగారాన్ని బయటకు తీసినా లేదా లోపల ఉంచినా, ముగ్గురు అధికారులు, ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు, ఒక ఆడిట్ సిబ్బంది ఎల్లప్పుడూ అక్కడే ఉంటారు. కనీసం అక్కడ ఒక బల్బు మార్చాలన్నా వారంతా ఉండాల్సిందే.
2024 లెక్కల ప్రకారం, ఈ ఖజానాలో దాదాపు 5,07,000 గోల్డ్ బ్రిక్స్ ఉన్నాయి, వీటి మొత్తం బరువు 6,331 మెట్రిక్ టన్నులు. ఈ బంగారం 122 వేర్వేరు గదులలో భద్రపరిచారు. ఒక దేశం లేదా సంస్థ బంగారం మరొకదానితో కలవకుండా ఉండేందుకు, ప్రతి గదిలో ఒక్క దేశానికి చెందిన బంగారం మాత్రమే ఉంటుంది. ప్రతి గదికి మూడు రకాల తాళాలు వేస్తారు. అందులో ఒక ప్యాడ్‌లాక్, రెండు నంబర్ కాంబినేషన్ లాక్స్, ఒక ఆడిటర్ సీల్ ఉంటాయి.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, అనేక దేశాలు తమ బంగారాన్ని భద్రత కోసం ఇక్కడికి పంపాయి. 1973 నాటికి ఇక్కడ 12,000 టన్నులకు పైగా బంగారం నిల్వ చేయబడింది. ప్రస్తుతం ఈ నిల్వ కొద్దిగా తగ్గినా, ఇది ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వల ఖజానాగా ఉంది. ఈ ఖజానా 90 టన్నుల ఉక్కు తలుపుతో మూసివేయబడుతుంది. ఇది గాలి చొరబడకుండా, నీరు లీక్ అవ్వకుండా ఉంటుంది. ఖజానా గోడలు ఉక్కు, కాంక్రీట్‌తో నిర్మించారు. నిరంతరం సీసీటీవీ కెమెరాలు, మోషన్ సెన్సార్లు, సాయుధ గార్డుల నిఘాలో ఉంటాయి.
ప్రతి గోల్డ్ బ్రిక్నుచాలా జాగ్రత్తగా తూకం వేసి, పరిశీలిస్తారు. జమ చేసిన అదే బంగారాన్ని తిరిగి ఇస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ బ్రిక్స్ 100% స్వచ్ఛమైన బంగారం కావు. బ్రిక్స్ గట్టిగా ఉండటానికి, తమ ఆకారాన్ని కోల్పోకుండా ఉండటానికి వాటిలో కొద్ది మొత్తంలో రాగి, వెండి లేదా ప్లాటినం వంటి లోహాలను కూడా కలుపుతారు. ఈ విధంగా, న్యూయార్క్ ఈ ఖజానా ప్రపంచంలోనే అత్యంత లోతైనది, అత్యంత సురక్షితమైనది. రహస్యమైన బంగారు నిల్వ కేంద్రంగా పరిగణిస్తారు.
