Sridhar Vembu : ప్రపంచంలోనే ఖరీదైన విడాకులు? శ్రీధర్ వెంబూ ఆస్తుల వాటాపై అమెరికా కోర్టు సంచలన తీర్పు
శ్రీధర్ వెంబూ ఆస్తుల వాటాపై అమెరికా కోర్టు సంచలన తీర్పు

Sridhar Vembu : ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబూ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆయన విడాకుల కేసు ఒక మలుపు తిరిగింది. అమెరికా కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకుల కేసుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. తన భార్యకు ఇవ్వాల్సిన ఆస్తి వాటా విషయంలో కోర్టు ఇప్పుడు ఆయనను ఏకంగా రూ.15 వేల కోట్ల బాండ్ సమర్పించాలని ఆదేశించింది.
జోహో కో-ఫౌండర్ శ్రీధర్ వెంబూ విడాకుల కేసు ప్రస్తుతం కాలిఫోర్నియా హైకోర్టులో నడుస్తోంది. ఈ విడాకుల ప్రక్రియలో భాగంగా తన భార్యకు రావాల్సిన ఆస్తి వాటాను ఆయన పక్కదారి పట్టించారని భార్య ప్రమీల శ్రీనివాసన్ కోర్టును ఆశ్రయించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కోర్టు, విడాకుల ఒప్పందం ముగిసే వరకు సెక్యూరిటీగా 1.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ.15,000 కోట్లు) బాండ్లను సమర్పించాలని వెంబూను ఆదేశించింది. జనవరి 2025లో ఈ కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి.
శ్రీధర్ వెంబూ భార్య ప్రమీల ఒక విద్యావేత్త, హెల్త్ టెక్ నిపుణురాలు. ఆమె నవంబర్ 2024లో వేసిన పిటిషన్‌లో ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. శ్రీధర్ వెంబూ విడాకుల నోటీసు ఇచ్చిన తర్వాత, జోహో కార్పొరేషన్‌లో తనకున్న మెజారిటీ వాటాను రహస్యంగా తన సోదరులకు మరియు సన్నిహితులకు బదిలీ చేశారని ఆమె ఆరోపించారు. మూడు విడతలుగా ఈ లావాదేవీలు జరిగాయని, తద్వారా తనకు రావాల్సిన ఆస్తిని తగ్గించడానికి ప్రయత్నించారని ఆమె పేర్కొన్నారు.
ప్రమీల శ్రీనివాసన్ తన వాదనలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. "శ్రీధర్ తన ఉద్యోగం వదిలేసి వ్యాపారం ప్రారంభించినప్పుడు, నేను నా సంపాదనతో ఆయనకు అండగా నిలబడ్డాను. మా పెళ్లి జరిగిన సమయంలో నిర్మించిన కంపెనీలో ఇప్పుడు ఆయనకు కేవలం 5 శాతం వాటా మాత్రమే ఉందని చెప్పడం నన్ను షాక్ కు గురిచేసింది. మిగిలిన 80 శాతం వాటా ఆయన తోబుట్టువుల దగ్గర ఉందని అబద్ధం చెబుతున్నారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈ ఆరోపణలను శ్రీధర్ వెంబూ ఖండించారు. జోహో కంపెనీలో తన వాటా మొదటి నుండి కేవలం 5 శాతమేనని, మెజారిటీ వాటా తన సోదరుల పేరు మీదనే ఉందని ఆయన వాదిస్తున్నారు. ఫోర్బ్స్ 2025 నివేదిక ప్రకారం.. వెంబూ కుటుంబం మొత్తం ఆస్తి విలువ సుమారు 6 బిలియన్ డాలర్లు (రూ.50 వేల కోట్లు). 2019లో ఆయన అమెరికా నుంచి భారత్ కు తిరిగి వచ్చారు, అప్పటి నుంచే వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి.
ప్రమీల శ్రీనివాసన్ సాధారణ మహిళ కాదు. ఆమె ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. హెల్త్ టెక్ రంగంలో ఆమెకు మంచి పేరుంది. అలాగే ఆమె ద బ్రెయిన్ ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని సంస్థను స్థాపించి, ఆటిజం బాధితుల కోసం పరిశోధనలు, సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు.
కాలిఫోర్నియా కోర్టు ఈ వ్యవహారాన్ని పరిశీలించిన తర్వాత, జోహో సంస్థల ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించడానికి ఒక రిసీవర్‌ను నియమించింది. అలాగే కంపెనీలో ఎటువంటి పెద్ద మార్పులు చేయకూడదని స్టే ఇచ్చింది. వెంబూ ఉద్దేశపూర్వకంగానే తన భార్య ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని కోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. అందుకే ఇంత భారీ మొత్తంలో బాండ్ అడిగింది. ఒకవేళ విడాకులు ఖరారైతే, ఆమెకు చెల్లించాల్సిన పరిహారం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది.

