WPI Inflation : భారత ఆర్థిక వ్యవస్థలో ధరల సునామీ.. 9 నెలల రికార్డులను తిరగరాసిన ద్రవ్యోల్బణం
9 నెలల రికార్డులను తిరగరాసిన ద్రవ్యోల్బణం

WPI Inflation : సామాన్యుడిపై ద్రవ్యోల్బణం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం షాక్ నుంచి కోలుకోకముందే, ఇప్పుడు టోకు ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం.. దేశంలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం జనవరి నెలలో 9 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. లోహాలు, ఆహార వస్తువుల ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం.. జనవరి 2026లో టోకు ద్రవ్యోల్బణం 1.81 శాతానికి పెరిగింది. డిసెంబర్ నెలలో ఇది కేవలం 0.83 శాతంగా మాత్రమే ఉండేది. అంటే ఒక్క నెలలోనే ధరల పెరుగుదల వేగం రెట్టింపు అయ్యింది. పారిశ్రామిక అవసరాలకు వాడే బేస్ మెటల్స్, ఆహార పదార్థాలు, వస్త్రాలు, తయారీ రంగ ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల హోల్‌సేల్ మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది.
డిసెంబర్ నెలలో 0.00 శాతంగా ఉండి, వినియోగదారులకు ఊరటనిచ్చిన ఆహార ద్రవ్యోల్బణం, జనవరిలో 1.41 శాతానికి ఎగబాకింది. కూరగాయల ధరల్లో వచ్చిన అనూహ్య మార్పులు సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. గత డిసెంబర్‌లో కూరగాయల ధరలు 3.50 శాతం తగ్గగా, జనవరిలో మాత్రం ఏకంగా 6.78 శాతం పెరిగాయి. ఉల్లి ధరల్లో తగ్గుదల ఉన్నప్పటికీ, గతంతో పోలిస్తే ఆ వేగం తగ్గింది. ఆలుగడ్డ ధరలు మాత్రం గతేడాది కంటే 38.84 శాతం తక్కువగానే ఉన్నాయి. పాల ధరలు కూడా ఏడాది ప్రాతిపదికన 2.51 శాతం పెరిగాయి. పప్పు దినుసుల ధరలు 11.05 శాతం తగ్గినప్పటికీ, డిసెంబర్ నాటి 13.88 శాతం తగ్గుదల కంటే ఇది తక్కువ.
కేవలం టోకు ధరలే కాదు, చేతికి అందే రిటైల్ ధరలు కూడా జనవరిలో 2.75 శాతానికి పెరిగాయి. పల్లెల్లో ద్రవ్యోల్బణం 2.73 శాతంగా ఉంటే, పట్టణాల్లో ఇది 2.77 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాలతో పాటు బంగారం వంటి విలువైన లోహాల ధరలు పెరగడం కూడా రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడానికి ఒక కారణమైంది. ఇంధనం, విద్యుత్ ధరలు మాత్రం మైనస్ 4.01 శాతం వద్ద కొనసాగుతూ కొంత ఊరటనిస్తున్నాయి.
ద్రవ్యోల్బణం పెరగడాన్ని గమనించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ , ఆర్థిక సంవత్సరం 2027 కోసం తన అంచనాలను సవరించింది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతంగా, రెండో త్రైమాసికంలో 4.2 శాతంగా ఉండవచ్చని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేస్తోంది. ధరల ఒత్తిడి క్రమంగా తగ్గుతుందని మొదట భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ధరల నియంత్రణకు మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది.

