UPI : యూపీఐలో తప్పుడు అకౌంట్‌కు డబ్బులు పంపారా? మీ సొమ్ము వాపస్ రావాలంటే ఇలా చేయండి
మీ సొమ్ము వాపస్ రావాలంటే ఇలా చేయండి

UPI : యూపీఐ వచ్చిన తర్వాత చిల్లర కష్టాలు తీరిపోయాయి. టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు అంతా స్కాన్ అండ్ పే చేసేస్తున్నాం. అయితే ఒక్కోసారి హడావిడిలోనో లేదా నంబర్ తప్పుగా కొట్టడం వల్లనో డబ్బులు వేరే వాళ్లకు వెళ్తుంటాయి. అలా తప్పుడు అకౌంట్‌కు యూపీఐ పేమెంట్ చేస్తే మళ్ళీ వెనక్కి వస్తాయా? అసలు బ్యాంక్ రూల్స్ ఏం చెబుతున్నాయి? పొరపాటున మీరు తప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తే వెంటనే చేయాల్సిన పనులు ఏంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
యూపీఐ వ్యవస్థను ఇన్‌స్టంట్ పేమెంట్ కోసం డిజైన్ చేశారు. అంటే మీరు ఇక్కడ పిన్ ఎంటర్ చేయగానే, మరుక్షణమే అవతలి వ్యక్తి అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఇందులో ఆటో రివర్సల్ లేదా క్యాన్సిల్ అనే ఆప్షన్లు ఉండవు. స్క్రీన్ మీద సక్సెస్ అని వచ్చిందంటే చాలు.. చట్టబద్ధంగా ఆ డబ్బు ఇప్పుడు అవతలి వ్యక్తి సొంతం. బ్యాంక్ నిబంధనల ప్రకారం, ఒకరి అకౌంట్లో ఉన్న సొమ్మును వారి అనుమతి లేకుండా వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. అది మీరు పొరపాటున పంపినా సరే, అది మీ బాధ్యతే అని బ్యాంకులు చెబుతాయి.
ఒకవేళ మీరు తప్పుడు అకౌంట్‌కు డబ్బులు పంపితే, ముందుగా మీరు చేయాల్సిన పని.. ఆ పేమెంట్ చేసిన యాప్ (PhonePe, Google Pay, Paytm మొదలైనవి)లోని Dispute లేదా Wrong Transfer అనే ఆప్షన్ ద్వారా ఫిర్యాదు చేయడం. ఇది చేస్తే మీ ఫిర్యాదు రికార్డుల్లోకి వెళ్తుంది. వెంటనే మీ బ్యాంక్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించి లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వాలి. అప్పుడు మీ బ్యాంక్, అవతలి వ్యక్తి బ్యాంక్‌ను సంప్రదిస్తుంది. ఆ వ్యక్తికి ఫోన్ చేసి "పొరపాటున మీ అకౌంట్‌కు డబ్బులు వచ్చాయి, దయచేసి వెనక్కి ఇవ్వండి" అని కోరుతుంది.
ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. అవతలి వ్యక్తి మంచివాడైతే వెంటనే మీ డబ్బులు వెనక్కి ఇస్తాడు. కానీ, అతను గనుక నేను ఇవ్వను అని మొండికేస్తే మాత్రం బ్యాంకులు కూడా ఏమీ చేయలేవు. ఎందుకంటే ఖాతాదారుడి అనుమతి లేకుండా అకౌంట్ నుంచి రూపాయి కూడా తీసే హక్కు బ్యాంకులకు లేదు. అప్పుడు మీరు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాల్సి ఉంటుంది. కానీ అక్కడ కూడా మీ డబ్బులు తిరిగి వస్తాయనే గ్యారెంటీ ఉండదు. కేవలం ఆ వ్యక్తిని ఒప్పించడం ద్వారానే మీ సొమ్మును వెనక్కి తెచ్చుకోగలరు.
యూపీఐ వాడేటప్పుడు మనం ఒక చేదు నిజాన్ని గుర్తుంచుకోవాలి. ఈ టెక్నాలజీ ఎంత వేగంగా పని చేస్తుందో, పొరపాటు జరిగితే రికవరీ కూడా అంతే కష్టమవుతుంది. అందుకే పేమెంట్ చేసేటప్పుడు ముఖ్యంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా లేదా నంబర్ టైప్ చేసినా.. రిసీవర్ పేరు ఒకసారి సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ఒక్క సెకన్ ఆలస్యమైనా పర్లేదు కానీ, పేరు చెక్ చేసుకున్న తర్వాతే పిన్ ఎంటర్ చేయండి. అలాగే, పెద్ద మొత్తంలో డబ్బులు పంపేటప్పుడు మొదట ఒక రూపాయి పంపి, అది సరైన వ్యక్తికి చేరిందో లేదో కన్ఫర్మ్ చేసుకున్నాక మిగతా సొమ్ము పంపడం ఉత్తమం.

