Yes Bank Cyber Attack : ఓటీపీ లేకుండానే బ్యాంక్ అకౌంట్లు ఖాళీ.. యస్ బ్యాంక్ లో భారీ సైబర్ మోసం
యస్ బ్యాంక్ లో భారీ సైబర్ మోసం

Yes Bank Cyber Attack : ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్‌లో జరిగిన రూ.590 కోట్ల భారీ కుంభకోణం మరువక ముందే, బ్యాంకింగ్ రంగాన్ని మరో భారీ సైబర్ దాడి వణికించింది. ఈసారి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యస్ బ్యాంక్ లక్ష్యంగా హ్యాకర్లు రెచ్చిపోయారు. హర్యానా ప్రభుత్వ నిధులను ఐడీఎఫ్‌సీ కేసులో పక్కదారి పట్టించినట్టే, ఇక్కడ కూడా యస్ బ్యాంక్ మల్టీ-కరెన్సీ ప్రిపెయిడ్ ఫారెక్స్ కార్డ్ సిస్టమ్‌లోకి చొరబడి కోట్లాది రూపాయలను విదేశీ ఖాతాలకు మళ్లించారు. ఈ ఘటన భారతీయ బ్యాంకింగ్ భద్రతా వ్యవస్థలోని లొసుగులను మరోసారి బయటపెట్టింది.
ఫిబ్రవరి 24, 2026 తెల్లవారుజామున ఈ భారీ సైబర్ దోపిడీ జరిగింది. యస్ బ్యాంక్, బుక్ మై ఫారెక్స్ భాగస్వామ్యంతో జారీ చేసిన ఫారెక్స్ కార్డులే లక్ష్యంగా హ్యాకర్లు దాడికి పాల్పడ్డారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:30 నుంచి 8:30 గంటల మధ్య, అంటే మనం నిద్రలో ఉన్న సమయంలో.. ఒక లాటిన్ అమెరికన్ దేశానికి (బ్రెజిల్ అని సమాచారం) చెందిన 15 మంది వ్యాపారుల ఖాతాల్లోకి అక్రమంగా డబ్బులు బదిలీ అయ్యాయి. కేవలం ఐదు గంటల వ్యవధిలో సుమారు 5,000 మంది కస్టమర్ల ఖాతాల నుండి 0.28 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2.54 కోట్లు) మాయమయ్యాయి. కస్టమర్లకు అసలు ఏం జరుగుతుందో తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
హ్యాకర్లు ఈ దోపిడీ కోసం బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నంబర్లోని సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకున్నారు. సాధారణంగా మన దేశంలో ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే ఓటీపీలేదా టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ తప్పనిసరి. కానీ, ఈ లావాదేవీలు జరిగిన దేశాల్లో ఈ-కామర్స్ కొనుగోళ్లకు ఓటీపీ అవసరం లేదు. ఈ భౌగోళిక భద్రతా లోపాన్ని కనిపెట్టిన సైబర్ నేరగాళ్లు, ఎలాంటి అడ్డంకులు లేకుండా వరుసగా ట్రాన్సాక్షన్లు జరిపి కస్టమర్ల కష్టార్జితాన్ని కాజేశారు.
అయితే, యస్ బ్యాంక్ లోని ఫ్రాడ్ మానిటరింగ్ సిస్టమ్ ఈ అసాధారణ లావాదేవీలను వెంటనే గుర్తించడంతో మరింత నష్టం తప్పింది. బ్యాంక్ అప్రమత్తమై తక్షణమే స్పందించడం వల్ల మరో 688 అక్రమ లావాదేవీలను బ్లాక్ చేయగలిగారు. దీనివల్ల సుమారు రూ. 90 లక్షలకు పైగా (0.1 మిలియన్ డాలర్లు) సొమ్ము హ్యాకర్ల పాలు కాకుండా ఆగిపోయింది. భద్రతా చర్యల్లో భాగంగా సదరు లాటిన్ అమెరికన్ దేశం నుంచి జరిగే అన్ని ఈ-కామర్స్ లావాదేవీలను బ్యాంక్ ప్రస్తుతానికి పూర్తిగా నిలిపివేసింది.
బాధిత కస్టమర్లకు యస్ బ్యాంక్ ఒక భరోసా ఇచ్చింది. కార్డు నెట్‌వర్క్ కంపెనీలతో కలిసి ఛార్జ్-బ్యాక్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని, పోగొట్టుకున్న డబ్బును తిరిగి కస్టమర్ల ఖాతాల్లోకి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేసింది. సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీ ప్రయాణాలు చేసేవారు లేదా ఫారెక్స్ కార్డులు వాడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

