EMI Trend: ఈఎమ్‌ఐ క్రేజ్.. నేటి యువతను ముంచేస్తున్న సులభ వాయిదాల ఉచ్చు
సులభ వాయిదాల ఉచ్చు

EMI Trend: నేటి యువతలో ఈఎమ్‌ఐ సంస్కృతి విపరీతంగా పెరిగిపోతోంది. చేతిలో రూపాయి లేకపోయినా ఐఫోన్, ల్యాప్‌టాప్, కాస్ట్లీ టీవీల నుంచి విహారయాత్రల వరకు ప్రతీదీ ఈఎమ్‌ఐ పై కొనేస్తున్నారు. నెలాఖరుకు వచ్చేసరికి ఈ చిన్న చిన్న వాయిదాలన్నీ కలిసి పెద్ద ఆర్థిక భారంగా మారి ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. ఒకప్పుడు ఇంట్లో కొత్త వస్తువు కొనాలంటే రూపాయి రూపాయి కూడబెట్టి జేబులో రూపాయి ఉంటేనే అడుగు బయటపెట్టేవారు. నేటి తరం ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. కోరికలను వాయిదా వేసుకోవడానికి యువత ఎంతమాత్రం సిద్ధంగా లేరు. కొత్త ఫోన్, లేటెస్ట్ బైక్, రెస్టారెంట్లలో డిన్నర్లు, వీకెండ్ ట్రిప్పులు.. ఇలా ప్రతీ అనుభవాన్ని తక్షణమే ఆస్వాదించాలనుకుంటున్నారు. ఈ బలహీనతనే ఫైనాన్స్ కంపెనీలు తమ వ్యాపార వ్యూహంగా మార్చుకున్నాయి. నెలకు రూ.3,000 కడితే చాలు రూ.90,000 విలువైన ఐఫోన్ చేతికి వస్తుందనగానే యువత ఆలోచించకుండా ఆకర్షితులవుతున్నారు.
సిబిల్ నివేదికలో షాకింగ్ నిజాలు
యంగ్ జనరేషన్‌లో అప్పుల సంస్కృతి ఎంత వేగంగా పెరుగుతుందో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ విడుదల చేసిన మార్చి 2026 నివేదిక ప్రకారం, 35 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న కొత్త రుణాలు తీసుకునే వారి సంఖ్య ఏకంగా 17 శాతం పెరిగింది. ప్రథమంగా రుణాలు పొందుతున్న వారిలో 35 ఏళ్లలోపు వారే 58 శాతం ఉండటం గమనార్హం. టీవీలు, ఫ్రిజ్‌లు వంటి వినియోగ వస్తువుల కోసం తీసుకునే రుణాలు 22 శాతం పెరిగాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డ్ వాడకం 14 శాతం మేర పెరిగింది.
ఒక్కటితో మొదలై కొంపముంచుతున్న వాయిదాలు
తొలుత ఒక ఫోన్ కొనుగోలుతో మొదలయ్యే ఈఎమ్‌ఐ ప్రయాణం, ఆపై ల్యాప్‌టాప్, హోమ్ అప్లయెన్సెస్, ఆపై బైక్ లేదా క్రెడిట్ కార్డ్ బిల్లుల వరకు వెళ్తోంది. విడివిడిగా చూసినప్పుడు ప్రతీ వాయిదా చిన్నగానే కనిపిస్తుంది. నెల చివరికి వచ్చేసరికి జీతంలో సింహభాగం ఈఎమ్‌ఐలకే సరిపోతోంది. అనుకోకుండా ఉద్యోగం పోయినా లేదా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా తీవ్రమైన ఒత్తిడిలోకి జారుకుంటున్నారు.
ఆర్థిక నిపుణులు ఇస్తున్న 70:30 గోల్డెన్ రూల్
ఈఎమ్‌ఐల ఉచ్చు నుంచి బయటపడటానికి ఆర్థిక నిపుణులు 70:30 సూత్రాన్ని సూచిస్తున్నారు. నెలకు వచ్చే నికర ఆదాయంలో ఈఎమ్‌ఐలు ఎట్టి పరిస్థితుల్లోనూ 30 శాతానికి మించకూడదు. మిగిలిన 70 శాతాన్ని ఇంటి ఖర్చులు, భవిష్యత్ అవసరాల పొదుపు కోసం కేటాయించాలి. ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి అనవసర వస్తువులను ఈఎమ్‌ఐపై కొనే ముందు, అసలు వడ్డీ రేట్లు ఎంత పడుతున్నాయో, మొత్తం మీద ఎంత ఎక్కువ చెల్లిస్తున్నామో లెక్కలు వేసుకోవడం చాలా ముఖ్యం.

