రియల్ ఎస్టేట్ రంగంలోకి జెప్టో

Zepto : ఆన్‌లైన్‌లో కిరాణా సామాగ్రిని కేవలం 10 నిమిషాల్లో ఇంటికి డెలివరీ చేసే క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెడుతోంది. దీని కోసం అభినందన్ లోధా అనే రియల్ ఎస్టేట్ డెవలపర్‌తో జెప్టో ఒక కొత్త భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇకపై మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో జెప్టో యాప్‌ను ఓపెన్ చేసి కేవలం పది నిమిషాల్లోనే రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టేందుకు బుక్ చేసుకోగలుగుతారు. ఈ కొత్త సేవతో సామాన్య ప్రజలకు కూడా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం గతంలో కంటే సులభం కానుంది.

నిజానికి పది నిమిషాల్లోనే ఒక ఆస్తిని కొనుగోలు చేయలేరు. అయితే, జెప్టో యాప్ ద్వారా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టేందుకు బుకింగ్ ప్రక్రియను కేవలం 10 నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. మీరు జెప్టో యాప్‌లో మీకు నచ్చిన ప్రాజెక్ట్‌ను ఎంచుకుని బుక్ చేసుకున్న వెంటనే, రియల్ ఎస్టేట్ ఏజెంట్ లేదా ఒక నిపుణుడు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఆ తర్వాత వీడియో కాల్ ద్వారా మిగిలిన లావాదేవీల ప్రక్రియ గురించి మీకు వివరిస్తారు. ఇది డిజిటల్‌గా జరిగే ఒక సులభమైన ప్రక్రియ, ఇది పెట్టుబడిదారులకు చాలా సమయం ఆదా చేస్తుంది.

జెప్టో భాగస్వామ్యం కుదుర్చుకున్న హౌస్ ఆఫ్ అభినందన్ లోధా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ, భారతదేశంలో పలు కీలక ప్రాంతాలలో ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. గోవా, అలీబాగ్, అయోధ్య, దపోలి, బృందావన్ వంటి పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలలో వీరు భూమి అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టారు. ఇటీవల అమృత్‌సర్, సిమ్లాలో కూడా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. మీరు జెప్టో యాప్‌లోకి లాగిన్ అయి, సెర్చ్ బార్‌లో Land అని టైప్ చేస్తే, అందుబాటులో ఉన్న ప్రాజెక్టుల జాబితాను చూడవచ్చు.

ఆన్‌లైన్‌లో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రీట్ అనేది అందులో ఒకటి. దీని పూర్తి పేరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్. వీటి ద్వారా ఎవరైనా ఒక ఆస్తిలో చిన్న మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఆ ఆస్తి విలువ పెరిగినప్పుడు లేదా అద్దె ద్వారా వచ్చే ఆదాయం పెరిగినప్పుడు పెట్టుబడిదారులకు లాభాలు వస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story