ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపుతో కస్టమర్లకు షాక్!

Online Food : భారతదేశంలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటో తమ ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచుతూ వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. ఒకరు పెంచితే మరొకరు పెంచుతూ, ఈ రెండు కంపెనీల మధ్య ధరల పెంపులో పోటీ మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ పెంపుతో ప్రతి ఆర్డర్‌పై కస్టమర్లకు అదనపు భారం పడుతోంది. తాజాగా, జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 10 నుంచి రూ. 12కు పెంచింది. దీనికి కొద్ది రోజుల ముందే స్విగ్గీ కూడా తన ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 12 నుంచి రూ. 14కు పెంచింది. జొమాటో పెంపు తర్వాత స్విగ్గీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఫీజును రూ. 14 నుంచి రూ. 15కు పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో స్విగ్గీ ఈ ఫీజును రూ. 14 లేదా రూ. 15కు పెంచే అవకాశం ఉంది, మిగిలిన రోజుల్లో రూ. 12 ఉండే అవకాశం ఉందని అంచనా.

ప్లాట్‌ఫామ్ ఫీజు అంటే ఏమిటి?

మీరు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో చేసే ప్రతి ఆర్డర్‌కు ఈ ప్లాట్‌ఫామ్ ఫీజు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. మీరు రూ. 50 ఆర్డర్ చేసినా, లేదా రూ. 2000 ఆర్డర్ చేసినా ఈ ఫీజు ఒకేలా ఉంటుంది. ఇది ఆర్డర్ విలువతో సంబంధం లేకుండా ఉంటుంది.

ఇతర ఛార్జీలు కూడా

ప్లాట్‌ఫామ్ ఫీజుతో పాటు, కస్టమర్లు జీఎస్టీ, డెలివరీ ఫీజు, ప్యాకేజింగ్ ఫీజు, డెలివరీ భాగస్వామికి టిప్స్ వంటి ఇతర ఛార్జీలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. వర్షం పడినప్పుడు లేదా ఆర్డర్లు ఎక్కువగా ఉన్న సమయాల్లో సర్జ్ ప్రైసింగ్ పేరుతో అదనపు ఛార్జీలు కూడా విధించడం మనం చూస్తున్నాం.

వ్యాపార వ్యూహాల్లో మార్పులు

జొమాటో, స్విగ్గీ సంస్థలు తమ ప్రధాన వ్యాపారం అయిన ఫుడ్ డెలివరీపైనే కాకుండా, క్విక్ కామర్స్ వైపు దృష్టి పెడుతున్నాయి. స్విగ్గీ తన ఇన్‌స్టామార్ట్ సర్వీసుతో, జొమాటో బ్లింకిట్ సర్వీసుతో క్విక్ కామర్స్ రంగంలో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం, భారతదేశంలో బ్లింకిట్ క్విక్ కామర్స్ విభాగంలో నంబర్ వన్ స్థానంలో ఉంది. జొమాటో ఫుడ్ డెలివరీ కంటే బ్లింకిట్ ద్వారానే ఎక్కువ లాభాలు పొందుతున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story