Zomato : జొమాటో కస్టమర్లకు షాక్.. మళ్ళీ పెరిగిన ప్లాట్‌ఫారమ్ ఫీజు.. ప్రతి ఆర్డర్‌పై అదనపు బాదుడు
ప్రతి ఆర్డర్‌పై అదనపు బాదుడు

Zomato : మీరు బిర్యానీ ప్రియులా? లేక ఇంట్లో వండలేక తరచుగా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. జొమాటో తన కస్టమర్లపై మరోసారి ప్లాట్‌ఫారమ్ ఫీజు బాదుడు మొదలుపెట్టింది. ఒక్కో ఆర్డర్‌పై వసూలు చేసే ఛార్జీలను పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రతిసారీ మీరు ఆర్డర్ చేసినప్పుడు మీ జేబుకు అదనంగా చిల్లు పడటం ఖాయం. జొమాటో యాప్ లోని తాజా వివరాల ప్రకారం.. ప్లాట్‌ఫారమ్ ఫీజును రూ.2.40 పైసల మేర పెంచారు. ఇప్పటి వరకు జీఎస్‌టీ కలపకముందు ప్రతి ఆర్డర్‌పై రూ.12.50 వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ ఛార్జీని రూ.14.90కి పెంచారు. అంటే మీరు రోజుకు ఒక్కసారి ఆర్డర్ చేసినా, పది సార్లు ఆర్డర్ చేసినా.. ప్రతిసారీ ఈ అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిందే. గత ఏడాది సెప్టెంబర్ 2025లో కూడా ఒకసారి ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జొమాటో పోటీదారు అయిన స్విగ్గీ కూడా ట్యాక్స్‌లతో కలిపి రూ.14.99 వరకు వసూలు చేస్తోంది. రెండు కంపెనీలు దాదాపు ఒకే రకమైన ధరలను అమలు చేస్తున్నాయి.
రాపిడో ఎంట్రీ.. కొత్త పోటీ మొదలైంది
ఒకవైపు జొమాటో, స్విగ్గీలు ఫీజులు పెంచుతుంటే.. మరోవైపు అర్బన్ మొబిలిటీ స్టార్టప్ రాపిడో ఫుడ్ డెలివరీ బిజినెస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులో ఓన్లీ పేరుతో తన సేవలను ప్రారంభించిన రాపిడో.. కస్టమర్ల నుంచి ఎలాంటి అదనపు ప్లాట్‌ఫారమ్ ఫీజు వసూలు చేయబోమని ప్రకటించింది. కేవలం డెలివరీ ఛార్జీలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. ఇప్పటికే అదనపు ఫీజులతో విసిగిపోయిన కస్టమర్లకు రాపిడో ఒక మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఇది భవిష్యత్తులో జొమాటో, స్విగ్గీలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.
ధరల పెంపు వెనుక అసలు కారణం ఏంటి?
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ముడి చమురు ధరలు పెరగడం ఈ ధరల పెంపునకు ఒక కారణం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే డెలివరీ పార్టనర్లకు ఇచ్చే ఖర్చులు కూడా పెరుగుతాయి. అందుకే ఆ భారాన్ని కస్టమర్లపై వేయక తప్పడం లేదని కంపెనీలు భావిస్తున్నాయి. కేవలం ప్లాట్‌ఫారమ్ ఫీజు మాత్రమే కాకుండా, డెలివరీ ఛార్జీలు, రెయిన్ ఫీజు, హ్యాండ్లింగ్ ఫీజు అంటూ రకరకాల పేర్లతో కస్టమర్ల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
కస్టమర్లపై పడుతున్న ప్రభావం
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే సామాన్యులకు ఇది మింగుడుపడని విషయమే. ఒక్కో ఆర్డర్‌పై రూ.15 దాకా కేవలం ప్లాట్‌ఫారమ్ ఫీజు కట్టడం వల్ల నెలవారీ బడ్జెట్ దెబ్బతింటోంది. రెస్టారెంట్ లో నేరుగా వెళ్తే వచ్చే ధర కంటే, యాప్ లో వచ్చే ధర చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో చాలా మంది కస్టమర్లు మళ్ళీ పాత పద్ధతిలోనే హోటళ్లకు వెళ్లడానికి లేదా ఇతర కొత్త యాప్స్ వైపు మొగ్గు చూపడానికి సిద్ధమవుతున్నారు. ఫుడ్ డెలివరీ రంగంలో ఈ ధరల యుద్ధం మున్ముందు ఇంకా ఎన్ని మార్పులు తెస్తుందో చూడాలి.

