జొమాటో కస్టమర్లకు భారీ షాక్

Zomato : పండుగ సీజన్ ప్రారంభం కాకముందే ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ సంస్థ జొమాటో తన వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. తమ ప్లాట్‌ఫామ్ ఫీజును ఏకంగా 20 శాతం పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఎటర్నల్ లిమిటెడ్ కింద పనిచేస్తున్న ఈ సంస్థ ప్లాట్‌ఫామ్ ఫీజును ఇంతకు ముందు ఉన్న రూ. 10 నుంచి రూ. 12కు పెంచింది. జొమాటో తన ప్రత్యర్థి సంస్థ స్విగ్గీ ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ప్లాట్‌ఫామ్ ఫీజును రూ. 14కు పెంచిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

జొమాటో ఇప్పుడు ఫుడ్ డెలివరీ చేసే అన్ని నగరాల్లో ఈ ఫీజును పెంచింది. ఈ పెంపు పండుగ సీజన్‌లో ఆర్డర్లు పెరుగుతాయన్న అంచనాతో తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం కూడా జొమాటో పండుగ సీజన్‌కు ముందు తమ ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. అప్పుడు ఫీజును రూ. 6 నుంచి రూ. 10కి పెంచింది. ఈ పెంపు కేవలం మూడు నెలల ముందు, అంటే రూ. 5 నుంచి రూ. 6కి పెంచిన తర్వాత జరిగింది.

జూన్ 2025తో ముగిసిన త్రైమాసికంలో జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ లిమిటెడ్ నికర లాభంలో 36 శాతం క్షీణతను నమోదు చేసింది. మార్చి త్రైమాసికంలో రూ. 39 కోట్లుగా ఉన్న నికర లాభం, ఈ త్రైమాసికంలో రూ. 25 కోట్లకు తగ్గింది. లాభాలు తగ్గుతున్న నేపథ్యంలో, ఆదాయాన్ని పెంచుకోవడానికి కంపెనీ ఈ ఫీజు పెంపు నిర్ణయం తీసుకుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

జొమాటోకు ముందు, మరో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా తమ ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. పండుగ సీజన్‌లో డిమాండ్ పెరుగుతుందని పేర్కొంటూ, స్విగ్గీ తమ ఫీజును రూ. 12 నుంచి రూ. 14కు పెంచింది. గత రెండేళ్లలో స్విగ్గీ తమ ప్లాట్‌ఫామ్ ఫీజును ఏకంగా 600 శాతం పెంచడం గమనార్హం. ఏప్రిల్ 2023లో రూ. 2గా ఉన్న ఫీజు, జులై 2024లో రూ. 6కి, అక్టోబర్ 2024లో రూ. 10కి పెరిగి, ఇప్పుడు రూ. 14కు చేరింది.

ప్రతిరోజు స్విగ్గీ 20 లక్షలకు పైగా ఆర్డర్‌లు డెలివరీ చేస్తుందని అంచనా. ఈ ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపుతో స్విగ్గీకి రోజుకు కోట్లలో అదనపు ఆదాయం వస్తుందని నిపుణులు పేర్కొన్నారు. వినియోగదారులపై భారం పడుతున్నప్పటికీ, సంస్థలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story