Zomato : ఇక ఆర్డర్ పెడితే మీ పేరు, అడ్రస్ అందరికీ తెలుస్తుంది.. కంగారు పడకండి..పర్మిషన్ అడుగుతారు
కంగారు పడకండి..పర్మిషన్ అడుగుతారు

Zomato : ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో త్వరలో ఒక కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ ద్వారా జొమాటో కస్టమర్‌లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అంటే పేరు, చిరునామా, ఫోన్ నంబర్ ఇకపై నేరుగా రెస్టారెంట్‌లతో పంచుకోనుంది. దీని ద్వారా రెస్టారెంట్‌లు తమ కస్టమర్లతో నేరుగా సంబంధాన్ని పెంచుకోవడానికి, వారి అభిరుచులను తెలుసుకోవడానికి, మరింత మెరుగైన ఆఫర్లను అందించడానికి అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పైలట్ దశలో ఉంది. దీనిపై నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI)తో జొమాటో చర్చలు జరుపుతోంది.
10 ఏళ్ల వివాదానికి పరిష్కారం
జొమాటో తీసుకున్న ఈ కొత్త నిర్ణయం దాదాపు 10 సంవత్సరాల నాటి ఒక పెద్ద వివాదాన్ని పరిష్కరించే అవకాశం ఉంది. ఫుడ్ డెలివరీ యాప్‌లు కస్టమర్ల వివరాలను తమ దగ్గరే దాచిపెడుతున్నాయని, దీనివల్ల కస్టమర్‌లతో నేరుగా రిలేషన్‌షిప్ ఏర్పడడం లేదని రెస్టారెంట్‌లు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. ఈ కొత్త సిస్టమ్ ప్రకారం రెస్టారెంట్‌లకు కస్టమర్ల వివరాలు వెంటనే లభించవు. కస్టమర్ అనుమతి ఇస్తేనే జొమాటో ఆ వివరాలను షేర్ చేస్తుంది. మీ ఫోన్ నంబర్‌ను రెస్టారెంట్‌తో పంచుకోవడానికి ముందు జొమాటో మీ నుంచి పర్మిషన్ అడుగుతుంది. డేటా షేరింగ్ వల్ల రెస్టారెంట్‌లు నేరుగా కస్టమర్‌లకు మార్కెటింగ్, ప్రమోషనల్ మెసేజ్‌లను పంపడానికి వీలవుతుంది.
ఈ ఫీచర్ ఎందుకు అవసరం?
కస్టమర్ల డేటా తమకు అందుబాటులో ఉండటం చాలా అవసరం అని రెస్టారెంట్‌లు చాలా కాలంగా కోరుతున్నాయి. దీని వెనుక వారికున్న ముఖ్య కారణాలు ఇవే.. తమకు ఎవరు ఆర్డర్ చేస్తున్నారు, ఎంత తరచుగా ఆర్డర్ చేస్తున్నారు, ఏ రకమైన ఆహారాన్ని ఇష్టపడుతున్నారు వంటి వివరాలను రెస్టారెంట్‌లు తెలుసుకోవాలి. కస్టమర్ అభిరుచిని తెలుసుకుంటే, వారు తమ మార్కెటింగ్ డబ్బును మరింత తెలివిగా ఖర్చు చేయవచ్చు. కస్టమర్ల టేస్ట్‌కు మ్యాచ్ అయ్యే ప్రత్యేక ఆఫర్‌లు లేదా ప్రమోషన్‌లు నేరుగా పంపవచ్చు. కస్టమర్లతో దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పరచుకోవడానికి, వారితో నేరుగా కనెక్ట్ అవ్వడం చాలా ముఖ్యం అని రెస్టారెంట్‌లు బలంగా నమ్ముతున్నాయి.

