‘Hanuman Ansh’: 1.8 కోట్ల బడ్జెట్.. రూ.400 కోట్ల వసూళ్లు.. బాక్సాఫీస్ సంచలనం హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్ ..
డేట్ ఫిక్స్ ..

‘Hanuman Ansh’: చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని సంచలనాలు సృష్టిస్తున్న ఆధ్యాత్మిక చిత్రం హనుమాన్ అంశ్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఏకంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసిన ఈ డివైన్ బ్లాక్‌బస్టర్.. ఎట్టకేలకు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్వయంగా ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
రూ.1.8 కోట్ల నుంచి రూ.400 కోట్ల దాకా.. అరుదైన రికార్డు..
కేవలం రూ.1.8 కోట్ల అత్యల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్ అంశ్ భారతీయ చిత్రసీమలోనే అత్యంత లాభదాయకమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సెప్టెంబర్ 28 నాటికి కేవలం భారతదేశంలోనే రూ.300 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. హప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మైలురాయిని దాటి ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆలస్యమైనా.. హోంబలే ఫిల్మ్స్ ద్వారా గ్రాండ్ ఎంట్రీ
వాస్తవానికి ఈ సినిమా తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 18నే విడుదల కావాల్సి ఉంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు చెందిన ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ద్వారా తెలుగులో విడుదల చేయాలని భావించినప్పటికీ, డీల్ కుదరకపోవడంతో వారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీనివల్ల సెప్టెంబర్ 15న జరగాల్సిన తెలుగు టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా చివరి నిమిషంలో రద్దయింది. అయితే తెలుగులో ఈ చిత్రానికి ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, కేజీఎఫ్, కాంతార వంటి పాన్ ఇండియా విజయాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్వయంగా తెలుగు రిలీజ్ బాధ్యతలను తీసుకుంది. దీంతో అక్టోబర్ 9న భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నీమ్ కరోలి బాబా జీవిత ప్రేరణతో కథనం
దర్శకుడు విశాల్ చతుర్వేది రూపొందించిన ఈ చిత్రం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా’
జీవిత ప్రేరణతో తెరకెక్కింది. లక్ష్మీ నారాయణ్ అనే సాధారణ వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టి, గొప్ప సాధువుగా ఎలా ఎదిగాడనే ప్రయాణాన్ని అత్యంత హృద్యంగా ఆవిష్కరించారు. బాబా పాత్రలో శోభినవ్ సత్యా జీవించగా, విహాన్ షెదెగే, పూర్ణిమ తివారీ కీలక పాత్రల్లో నటించారు. ఉత్తరాదిన ప్రకంపనలు సృష్టించిన ఈ ఆధ్యాత్మిక చిత్రం, తెలుగు బాక్సాఫీస్ వద్ద కూడా సరికొత్త వసూళ్ల ప్రభంజనం సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

