Jana Nayagan: కోలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్ నటించిన తాజా చిత్రం 'జన నాయగన్' చెన్నైలో భారీ గందరగోళానికి కేంద్రబిందువుగా మారింది. చెన్నైలోని పలు థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శనను అర్ధాంతరంగా నిలిపివేయడంతో ప్రేక్షకులు, ముఖ్యంగా కుటుంబ సమేతంగా వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారం 'ఏ' (A - Adults Only) సర్టిఫికెట్ జారీ అయిన విషయం తెలిసిందే. అయితే, ఆదివారం ఉదయం చెన్నైలోని కొన్ని ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో పోలీసులు హఠాత్తుగా తనిఖీలు చేపట్టారు. 'ఏ' రేటెడ్ సినిమాలకు మైనర్లను, అనగా 18 సంవత్సరాల వరికంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను థియేటర్లలోకి అనుమతించడం చట్టపరంగా నిబంధనలకు విరుద్ధం.

పోలీసుల తనిఖీల్లో ఈ నిబంధన ఉల్లంఘన బయటపడటంతో.. నడుస్తున్న షోలను ఉన్నట్టుండి నిలిపివేయవలసి వచ్చింది. థియేటర్ల లోపలికి వెళ్లి పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులను బయటకు పంపించే ప్రక్రియ సుమారు గంటపాటు కొనసాగింది. దీంతో థియేటర్ల వద్ద ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. టికెట్లు తీసుకుని సినిమా మధ్యలో బయటకు రావాల్సి రావడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ అనూహ్య ఘటనతో అప్రమత్తమైన మల్టీప్లెక్స్ యాజమాన్యాలు, సెన్సార్ బోర్డు నిబంధనలను ఇకపై మరింత ಕఠినంగా అమలు చేయాలని నిర్ణయించాయి. ఇకపై 'ఏ' సర్టిఫికెట్ ఉన్న సినిమాలకు మైనర్లతో వచ్చే ఎవరినీ లోపలికి అనుమతించబోమని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. నిబంధనల పట్ల కఠిన వైఖరి ప్రదర్శించకపోతే థియేటర్ల లైసెన్సులపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి, విజయ్ సినిమాకు తగిలిన ఈ బ్రేక్ చెన్నై సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story