RGV’s Tweet: 72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 'ఆర్టికల్ 370' చిత్రానికి గాను ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న యామీ గౌతమ్‌ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభినందించారు. యామీ ప్రయాణం, ఆమె పట్టుదల, రిస్క్ తీసుకునే గుణం, నటనపై ఆమెకు ఉన్న అంకితభావం చూసి తాను ఎంతో ప్రభావితమయ్యానని ఆయన అన్నారు.

'ఎక్స్' (X) వేదికగా వర్మ స్పందిస్తూ, "హే యామీ గౌతమ్, నాకు అవార్డుల మీద అంతగా నమ్మకం లేదు. కానీ, ఎన్నో ఏళ్ల నిజాయితీతో కూడిన కృషి ,కళపై అచంచలమైన నిబద్ధత వల్ల వచ్చే గుర్తింపును మాత్రం నేను నమ్ముతాను" అని పేర్కొన్నారు. కేవలం ఒక సినిమాగా కాకుండా, యామీ ఎంతో నమ్మి చేసిన చిత్రానికి ఈ గౌరవం దక్కడం మరింత ప్రత్యేకమని ఆయన తెలిపారు.

యామీ కెరీర్‌ను మలచిన కష్టాలు, ఆమె నిశ్చయత, నమ్మకం గురించి ప్రస్తావిస్తూ, ఈ జాతీయ అవార్డు ఆమె ఎన్నో ఏళ్ల కఠిన శ్రమకు ఫలితమని వర్మ కొనియాడారు. "జాతీయ అవార్డు మీకు గొప్ప గౌరవంగా అనిపించవచ్చు, కానీ ఈ స్థాయికి మిమ్మల్ని చేర్చిన మీ ప్రయాణం, మీరు ఎదుర్కొన్న కష్టాలు, పోరాటం, రిస్క్ తీసుకోవడం మరియు ఎక్కడా వెనకడుగు వేయని మీ మనస్తత్వం చూసి నేను వ్యక్తిగతంగా ఎంతో ముగ్ధుడిని అయ్యాను. ఇటుక ఇటుక పేర్చినట్టు మీ ప్రయాణం ఈ విజయానికి దారితీసింది. భవిష్యత్తులో మీరు మరిన్ని ఇలాంటి విజయాలు సాధిస్తారని నాకు నమ్మకం ఉంది" అని ఆయన రాసుకొచ్చారు.

'ఆర్టికల్ 370' చిత్రంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 'జూనీ హక్సర్' పాత్రలో యామీ గౌతమ్ చూపిన ప్రతిభకు ఈ అవార్డు దక్కింది. 72వ జాతీయ అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమ నటితో పాటు, ఉత్తమ ఫీచర్ ఫిలిం, ఉత్తమ సంగీతం విభాగాల్లో మొత్తం మూడు అవార్డులను దక్కించుకుంది. ఆదిత్య సుహాస్ జంభాలే దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్, 2019లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు నేపథ్యంలో తెరకెక్కింది. మలయాళ దర్శకుడు జయరాజ్ నేతృత్వంలోని 11 మంది సభ్యుల జ్యూరీ ఈ అవార్డులను ఎంపిక చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story