‘Aadarsha Kutumbam’: దసరాకు 'ఆదర్శ కుటుంబం'.. గాంధీ జయంతి నుండి పోస్ట్ పోన్ !
పోస్ట్ పోన్ !

‘Aadarsha Kutumbam’: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ "ఆదర్శ కుటుంబం" అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల చిత్రబృందం వెంకటేష్, శ్రీనిధి శెట్టిలతో పాటు వారి పిల్లలుగా నటిస్తున్న నటీనటులను పరిచయం చేస్తూ విడుదల చేసిన క్యారెక్టర్ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది.
అయితే, ఈ కుటుంబ కథా చిత్రం ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. మొదట ఆగస్టులో విడుదల చేయాలని భావించినప్పటికీ, తదుపరి ప్రణాళికలో భాగంగా అక్టోబర్ 2కు మార్చారు. ఇప్పుడు దసరా పండుగ సెలవుల కాలాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచనతో చిత్ర నిర్మాతలు ఈ సినిమా విడుదలను అక్టోబర్ 15 లేదా 16కి వాయిదా వేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ 'ఆదర్శ కుటుంబం' దసరా బరిలోకి మారితే, ఈ పండుగ సీజన్‌లో థియేటర్లలోకి రాబోతున్న ఏకైక పెద్ద తెలుగు సినిమా ఇదే కానుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమా నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది, దసరాకు దేవుడెరుగు 2026లోనే ఈ సినిమా విడుదలపై స్పష్టత లేని పరిస్థితి నెలకొంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్ 2' తప్పించి దసరా పండుగ సమయంలో బాక్సాఫీస్ వద్ద ఇతర ఏ పెద్ద సినిమాలు పోటీలో లేవు.
ఈ పరిణామాలు త్రివిక్రమ్-వెంకటేష్ చిత్రానికి దసరాను ఒక అద్భుతమైన అవకాశంగా మార్చాయి. అయితే విడుదల తేదీ మార్పుపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ మొదటి ఫ్యామిలీ యాక్షన్ డ్రామాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుండగా, ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

