Aamir Khan: మూడోసారి పెళ్లి పీటలెక్కిన అమీర్ ఖాన్.. గౌరీ స్ప్రాట్ తో పెళ్లి!
గౌరీ స్ప్రాట్ తో పెళ్లి!

Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. గత కొంతకాలంగా తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్న గౌరీ స్ప్రాట్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో గల అమీర్ ఖాన్ నివాసంలో ఆదివారం (జూలై 5) అత్యంత ప్రైవేట్‌గా, అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహ వేడుక సింపుల్‌గా జరిగింది.
పెళ్లి వేడుకతో పాటే వీరిద్దరూ వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేసి చట్టబద్ధంగా కూడా ఒకటయ్యారు. తమ వివాహాన్ని ఎంతో సాదాసీదాగా, ఆడంబరాలకు దూరంగా జరుపుకుంటామని అమీర్ ఖాన్ గతంలోనే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఎలాంటి హంగామా లేకుండా కేవలం ఇరు కుటుంబాలకు చెందిన వారు, కొద్దిమంది సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకలో అమీర్ ఖాన్ ముగ్గురు పిల్లలతో పాటు, గౌరీ కుమారుడు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అమీర్ ఖాన్‌కు ఇది మూడో వివాహం. ఆయనకు ఇదివరకు రీనా దత్తాతో మొదటి వివాహం జరిగింది, వీరికి జునైద్ ఖాన్, ఇరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2005లో ప్రముఖ దర్శకురాలు కిరణ్ రావును అమీర్ వివాహం చేసుకున్నారు. వీరికి ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. అయితే, 2021లో అమీర్ ఖాన్, కిరణ్ రావు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. విడిపోయినప్పటికీ కొడుకు బాధ్యతలను ఇద్దరూ కలిసి చూసుకుంటున్నారు.
ఇక అమీర్ ఖాన్‌ను పెళ్లాడిన గౌరీ స్ప్రాట్ బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. బ్యూటీ, లైఫ్‌స్టైల్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ముంబైలో 'బి బ్లంట్' (BBlunt) సెలూన్‌ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. 25 ఏళ్ల క్రితమే వీరిద్దరికీ పరిచయం ఉన్నప్పటికీ.. 2024 నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఏడాదికి పైగా సహజీవనం చేసిన ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటైంది.

