Action King Arjun Sarja: సీతాపయనం ఒక ఎమోషన్.. నా కూతురికి ఇదే అతిపెద్ద గిఫ్ట్
నా కూతురికి ఇదే అతిపెద్ద గిఫ్ట్

Action King Arjun Sarja: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా స్వీయ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్, నిరంజన్ (నటుడు ఉపేంద్ర మేనల్లుడు) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'సీతాపయనం'. ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే సందర్భంగా) ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, అర్జున్ ఆసక్తికరమైన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు.
బ్రహ్మానందం ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి తనదైన శైలిలో మాట్లాడుతూ, అర్జున్ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించారు.ఇండస్ట్రీలో నటులు చాలా మంది ఉంటారు, కానీ గొప్ప వ్యక్తిత్వం, మంచితనం, మానవత్వం కలిగిన వారు కొందరే ఉంటారు. అర్జున్ అటువంటి వారిలో ఒకరు, ఆయన నిజమైన జెంటిల్మెన్," అని కొనియాడారు. అర్జున్ దర్శకత్వం వహించిన 'జై హింద్ 2'లో తాను నటించానని, ఆయన ఎప్పుడూ ఎవరినీ డిమాండ్ చేయరని, చాలా సౌమ్యుడిగా ఉంటారని గుర్తు చేసుకున్నారు.
ఈ చిత్రంతో ఐశ్వర్యకు మంచి పేరు రావాలని, తండ్రి పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అర్జున్ ,ఐశ్వర్యలకు శ్రీరాముడు, హనుమంతుడు ఉన్న పెయింటింగ్‌ను బ్రహ్మానందం బహుమతిగా ఇచ్చి వారిని సర్ప్రైజ్ చేశారు.
తన కుమార్తెను వెండితెరకు పరిచయం చేస్తున్న తండ్రిగా అర్జున్ చాలా భావోద్వేగానికి గురయ్యారు.సీతాపయనం అనేది కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక ఎమోషన్. నా కూతురిని ఒక అర్థవంతమైన, పాజిటివ్ కథతో పరిచయం చేయాలని భావించాను. ఆమెకు నేను ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఇదే," అని అన్నారు. తన కెరీర్ మొదలై దాదాపు 42 ఏళ్లు దాటిందని, తెలుగు ప్రేక్షకులు తనను ఎప్పుడూ సొంత మనిషిలా ఆదరించారని గుర్తుచేసుకున్నారు. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ప్రేమ, కుటుంబ విలువలు ,భావోద్వేగాల సమాహారమని పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్, సత్యరాజ్ వంటి నటులు ఉండటం సినిమాకు పెద్ద ప్లస్ అని చెప్పారు.

