Actor Adivi Sesh: నా లవ్ స్టోరీ బ్రేకప్ పెయిన్ ను పదేళ్లు అనుభవించా
పదేళ్లు అనుభవించా

Actor Adivi Sesh: వరుస థ్రిల్లర్లతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో అడివి శేష్.. ఈసారి ఒక ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీతో మన ముందుకు వస్తున్నారు. అదే 'డెకాయిట్'. షానియల్ డియో దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలవుతోంది.
ఈ సినిమా కథ పుట్టుక గురించి శేష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "బిజీ రోడ్డుపై సిమెంట్ ఫుట్ పాత్ క్రాక్ నుంచి పుట్టిన ఒక చిన్న పువ్వు" అనే విజువల్ మెటాఫర్ నుండే ఈ కథ పుట్టిందట. ఒక తీవ్రమైన కోపం, యాక్షన్ మధ్య సాగే విఫలమైన ప్రేమకథే ఈ 'డెకాయిట్'.గత చిత్రాల్లో ప్రేమ ఒక భాగంగా మాత్రమే ఉండేదని, కానీ ఇందులో లవ్ స్టోరీనే మెయిన్ ప్లాట్ అని శేష్ స్పష్టం చేశారు. "లవ్ స్టోరీ మధ్య యాక్షన్ చూడ్డానికి వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారు.. కానీ యాక్షన్ సినిమాలో లవ్ వెతికితే మాత్రం డిజప్పాయింట్ అవుతారు" అంటూ సినిమా మూడ్‌ను వివరించారు.
మృణాల్ ఠాకూర్ నటన గురించి చెబుతూ.. ఆమెతో కాంపిటీషన్ స్పిరిట్‌తో వర్క్ చేశానని శేష్ చెప్పుకొచ్చారు. ఇక అనురాగ్ కశ్యప్‌ను నాగచైతన్య-శోభితల పెళ్లి వేడుకలో కలిసి ఈ కథ చెప్పగా.. ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ అని శేష్ కొనియాడారు.ఈ సినిమా కోసం అడివి శేష్ మదనపల్లి యాసను ప్రత్యేకంగా నేర్చుకున్నారు. ఎంతలా అంటే.. ఇంట్లో కూడా అదే యాసలో మాట్లాడితే వాళ్ల అమ్మ కూడా ఆశ్చర్యపోయారట. అంతేకాదు, చిన్నప్పటి నుంచి ఉన్న డ్యాన్స్ ఫోబియాను వదిలేసి, ఈ సినిమా కోసం ఆ లిమిట్స్‌ను కూడా దాటి స్టెప్పులేశారు శేష్.
మేజర్ తర్వాత బాలీవుడ్ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినా.. బ్రోకెన్ లవ్ స్టోరీపై ఉన్న ఇష్టంతోనే 'డెకాయిట్' వైపు మొగ్గు చూపారు. తన 19 ఏళ్ల వయసులో జరిగిన మొదటి బ్రేకప్ తాలూకు పెయిన్‌ను పదేళ్ల పాటు అనుభవించానని, ఆ ఎమోషన్‌ను ఈ చిత్రంలోని 'హరి' పాత్ర ద్వారా వెండితెరపై చూపిస్తున్నానని శేష్ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.

