Actor Ajith: మనమందరం బాధ్యులమే.. కరూర్ తొక్కిసలాటపై అజిత్..
కరూర్ తొక్కిసలాటపై అజిత్..

Actor Ajith: తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై ప్రముఖ నటుడు అజిత్ తొలిసారిగా స్పందించారు. ఈ దురదృష్టకర సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి గురించి ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేవలం నటుడు విజయ్‌తో సహా ఒకరిని వేలెత్తి చూపడం సరికాదని.. అందరూ బాధ్యులే అని ఆయన అన్నారు.
కరూర్ ఘటనపై అజిత్ వ్యాఖ్యలు
ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతూ.. కరూర్ వంటి రాజకీయ కార్యకలాపాలను పూర్తిగా నివారించాలి అని సూచించారు. "ఆ రోజు జరిగిన సంఘటన తమిళనాడులో అన్నింటినీ మార్చివేసింది. ఇది ఆ ఒక్క వ్యక్తి తప్పు కాదు. కానీ అందులో మన తప్పు కూడా ఉంది. దానికి మనమందరం బాధ్యులమే" అని ఆయన స్పష్టం చేశారు.
అభిమానులు, మీడియా సహా అన్ని వర్గాల వారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని అజిత్ సూచించారు.
సినీ సభల్లోనే ఇలాంటివి ఎందుకు..?
దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయని.. అయితే సినీతారలకు సంబంధించిన సభల్లోనే కరూర్ లాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని అజిత్ ఆందోళన వ్యక్తం చేశారు. క్రికెట్ మ్యాచ్‌లకు పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్లినా సురక్షితంగా తిరిగి వస్తారని, కానీ సినిమా సభలు, థియేటర్లలో మాత్రం భద్రత విషయంలో అదే పరిస్థితి లేదని అన్నారు. ఇండస్ట్రీ చుట్టే ఇలాంటి ప్రమాదాలు జరగడం వల్ల సినిమా పరిశ్రమకు చెడ్డపేరు వస్తోందని, దీనిపై మీడియా మరింత అవగాహన కలిగిస్తే మేలు జరుగుతుందని అజిత్ అభిప్రాయపడ్డారు.

