మాధవన్ జీవితాన్ని మార్చేసిన ఆ స్విట్జర్లాండ్ రైతు ఎవరు?

Actor Madhavan: సినిమా ఇండస్ట్రీలో ఫామ్‌లో ఉన్నప్పుడు గ్యాప్ తీసుకోవడం అంటే కెరీర్‌ను రిస్క్‌లో పడేయడమే. కానీ నటుడు మాధవన్ మాత్రం తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే నాలుగేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. దీని వెనుక ఒక వింతైన, ఆలోచింపజేసే సంఘటన ఉందని ఆయన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. చాలా ఏళ్ల క్రితం స్విట్జర్లాండ్‌లో ఒక తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది. మాధవన్ ఒక పాట కోసం ఆరెంజ్ రంగు ప్యాంట్, గ్రీన్ షర్ట్ వేసుకుని రోడ్డు మీద నిల్చున్నారు. అక్కడే ఉన్న ఒక స్థానిక రైతు మాధవన్‌ను చాలా నిర్లక్ష్యంగా.. ఏంటి వీడి వేషధారణ? అన్నట్టుగా ఒక చూపు చూశాడు. ఆ చూపు మాధవన్ అహాన్ని దెబ్బతీసింది. "నేనెవరో నీకు తెలుసా? ఒక్కసారి చెన్నైకి రా, నా రేంజ్ ఏంటో చూపిస్తా" అని మనసులో అనుకున్నారు.

అంతర్మథనం: అసలు నేనేం చేస్తున్నాను?

షూటింగ్ అయిపోయినా ఆ రైతు చూసిన చూపు మాధవన్‌ను వెంటాడింది. "ఒక సాధారణ మనిషి దృష్టిలో నా ఉనికి ఏంటి? నేను చేస్తున్న సినిమాల వల్ల సమాజానికి ఏం అందుతోంది?" అనే ప్రశ్నలు ఆయనను వేధించాయి. దీంతో వెంటనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి తనను తాను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.

రిక్షా కార్మికులతో ముచ్చట్లు.. జీవిత పాఠాలు

ఆ నాలుగేళ్ల విరామంలో మాధవన్ గ్లామర్ ప్రపంచానికి దూరంగా సామాన్యులతో గడిపారు. దేశాటనం చేస్తూ వివిధ ప్రాంతాల సంస్కృతులను పరిశీలించారు. రిక్షా కార్మికుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరితో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈ ప్రయాణమే ఆయనకు సాలా ఖడూస్ వంటి బలమైన పాత్రలు ఎంచుకునేలా స్పష్టతనిచ్చింది. ఆ బ్రేక్ వల్ల నేర్చుకున్న పాఠాలే ఇప్పటికీ తనను నటుడిగా నిలబెట్టాయని మాధవన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ధురంధర్ 2తో పాటు తమిళంలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story