తీవ్ర ఆగ్రహం

Actress Janhvi Kapoor: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను అమానుషంగా కొట్టి చంపిన (లిన్చింగ్) ఘటనపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణాన్ని ఆమె "నాగరికత లేని చర్య"గా అభివర్ణించారు. గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకుంటూ, ఈ హింసపై మౌనంగా ఉండవద్దని ప్రజలను కోరారు.

జాన్వీ తన పోస్ట్‌లో ఇలా రాశారు, "దీపు చంద్ర దాస్.. బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది అత్యంత దారుణం. ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఇది ఒక ఊచకోత. అతనిపై జరిగిన బహిరంగ దాడి గురించి మీకు తెలియకపోతే, దయచేసి దాని గురించి చదవండి, వీడియోలు చూడండి, ప్రశ్నలు అడగండి. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీలో ఆగ్రహం కలగకపోతే, ఆ కపటత్వమే మనల్ని నాశనం చేస్తుంది."

ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరిగే చిన్న చిన్న విషయాలకు స్పందిస్తాం కానీ, మన కళ్ల ముందే మన తోటి వారు దారుణంగా చంపబడుతుంటే మౌనంగా ఉండటం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "మతపరమైన వివక్ష, తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. మనం బాధితులమైనా లేదా నేరస్థులమైనా, మానవత్వాన్ని మరిచిపోకముందే అటువంటి చర్యలను ఖండించాలి" అని ఆమె పిలుపునిచ్చారు.

గత వారం బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్‌ జిల్లాలో దీపు చంద్ర దాస్ అనే యువకుడిని ఒక ఉన్మాద మూక దారుణంగా కొట్టి చంపింది. అనంతరం అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టి నిప్పు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మతపరమైన ఆరోపణల నేపథ్యంలో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story