Actress Sakshi Agarwal: పనీర్ కర్రీ ఆర్డర్ చేసిన హీరోయిన్.. వచ్చింది చూసి షాక్
వచ్చింది చూసి షాక్

Actress Sakshi Agarwal: హీరోయిన్ సాక్షి అగర్వాల్‌కి ఒక ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా చేదు అనుభవం ఎదురైంది. స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసిన పనీర్ వంటకంలో చికెన్ ముక్కలు రావడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంబంధిత రెస్టారెంట్ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఆకలిగా ఉండటంతో సాక్షి అగర్వాల్ ఒక ప్రముఖ రెస్టారెంట్ నుంచి పనీర్ కర్రీ ఆర్డర్ చేశారు. అయితే డెలివరీ వచ్చిన తర్వాత తినడం ప్రారంభించగా అందులో పనీర్‌తో పాటు చికెన్ ముక్కలు ఉండటాన్ని గమనించారు. దీంతో ఆమె షాక్‌కు గురయ్యారు. పుట్టినప్పటి నుంచి తాను పూర్తి శాకాహారినని.. ఇలాంటి అనుభవం తనకు ఎదురవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సంఘటనపై ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. "జీవితంలో ఎప్పుడూ మాంసాహారం ముట్టని నాకు ఇలాంటి అనుభవం ఎదురవ్వడం దారుణం. ఆహారం విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఒక శాకాహారికి చికెన్ పంపడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశారు" అని ఆమె ఆరోపించారు.
సాక్షి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తూ, రెస్టారెంట్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఫుడ్ డెలివరీ సంస్థలు, రెస్టారెంట్లు ఇలాంటి విషయాల్లో మరింత బాధ్యతగా వ్యవహరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారుల ఆహార ప్రాధాన్యతలను, నమ్మకాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది.
