Actress Sukanya: 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం.. సన్ టీవీపై డిఫమేషన్ కేసు గెలిచిన నటి సుకన్య!
సన్ టీవీపై డిఫమేషన్ కేసు గెలిచిన నటి సుకన్య!

Actress Sukanya: సాధారణంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కోర్టుల్లో వేసే పరువు నష్టం కేసులు కేవలం ప్రతీకాత్మక చర్యలుగానే మిగిలిపోతుంటాయి. చాలా సందర్భాల్లో ఇరు వర్గాలు కోర్టు వెలుపలే గుట్టుచప్పుడు కాకుండా సెటిల్ చేసుకోవడమో లేదా కేసులను వెనక్కి తీసుకోవడమో జరుగుతుంటుంది. కానీ, ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుకన్య విషయంలో మాత్రం అలా జరగలేదు. తన పరువుకు భంగం కలిగించిన ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్‌పై ఆమె ఏకంగా మూడు దశాబ్దాల పాటు రాజీలేని న్యాయపోరాటం చేసి, చివరికి ఘన విజయం సాధించారు. నటి సుకన్యకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆ సదరు ఛానల్‌ను ఆదేశించింది.
1996వ సంవత్సరంలో ప్రముఖ తమిళ వాహిని ‘సన్ టీవీ’ (Sun TV).. అప్పట్లో దేశాన్ని వణికించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌కు సంబంధించిన ఒక ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. ఆ ఇంటర్వ్యూలో వీరప్పన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని నటి సుకన్య అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా ఆ వ్యాఖ్యలను టెలికాస్ట్ చేసినందుకు సన్ టీవీ యాజమాన్యంపై ఆమె చెన్నై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన సిటీ సివిల్ కోర్టు.. సుకన్యకు అనుకూలంగా తీర్పునిస్తూ, ఆమెకు నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ సన్ టీవీ యాజమాన్యం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
గత ముప్పై ఏళ్లుగా సాగుతున్న ఈ లీగల్ బ్యాటిల్‌కు జూన్ 5 (2026) న మద్రాస్ హైకోర్టు ముగింపు పలికింది. సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన పాత తీర్పును సమర్థిస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సదరు ఇంటర్వ్యూను టీవీలో ప్రసారం చేయడానికి ముందే.. అందులోని వివాదాస్పద వ్యాఖ్యలను ఎడిట్ చేసే (తొలగించే) పూర్తి అధికారం, అవకాశం ఛానల్ యాజమాన్యానికి ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ ఛానల్ ఆ పని చేయకుండా, ఒక నటి పరువుకు భంగం కలిగించేలా ఆ కంటెంట్‌ను బ్రాడ్‌కాస్ట్ చేసినందుకు ఛానల్‌దే పూర్తి బాధ్యత అని న్యాయస్థానం తేల్చిచెప్పింది. కింద కోర్టు ఆదేశాల ప్రకారం నటి సుకన్యకు రూ. 10,00,500 (పది లక్షల ఐదు వందల రూపాయలు) పరిహారంగా చెల్లించాలని సన్ టీవీని హైకోర్టు ఆదేశించింది. దాదాపు 30 ఏళ్ల పాటు ఓపికగా న్యాయం కోసం పోరాడి, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకున్న నటి సుకన్యపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుండి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

