Kangana Ranaut Gives a Sharp Counter to Trolls: ఐశ్వర్య ఎవరికీ రుణపడి లేదు.. ఆ అలవాటు మార్చుకోండి.. ట్రోలర్స్‌కు కంగనా ఘాటు కౌంటర్..
ట్రోలర్స్‌కు కంగనా ఘాటు కౌంటర్..

Kangana Ranaut Gives a Sharp Counter to Trolls: తనదైన ఫైర్‌బ్రాండ్ మాటలతో నిత్యం వార్తల్లో ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్, తాజాగా మరో నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు మద్దతుగా నిలిచారు. ప్రతిష్ఠాత్మక క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య ధరించిన దుస్తులపై, ఆమె రూపంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, బాడీ షేమింగ్ ట్రోల్స్‌పై కంగనా తీవ్రంగా స్పందించారు. ఐశ్వర్య రాయ్ క్యాన్స్ లుక్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ, ట్రోలర్స్‌కు గట్టిగా బుద్ధి చెప్పారు.
ఆమె మిమ్మల్ని మెప్పించడానికి రాలేదు: కంగనా
ఐశ్వర్య రాయ్ లుక్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసించిన కంగనా, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇలా పేర్కొన్నారు. "ఫ్యాషన్, స్టైల్ అనేవి పూర్తి వ్యక్తిగతం. జీవితం పట్ల, మన వైఖరి పట్ల మనకున్న అభిప్రాయాన్ని అవి ప్రతిబింబిస్తాయి. ఏ మహిళ కూడా ఇక్కడ ఎవరికీ ఏమీ రుణపడి ఉండదు. ఐశ్వర్య అద్భుతంగా ఉన్నారు. ఆమెను మరోలా చూడాలనుకునే వారు, ముందు మీ సంగతి మీరు చూసుకోండి. ఆమె మిమ్మల్ని మెప్పించడానికి ఇక్కడికి రాలేదు. ఆమె చాలా గొప్పగా ఉన్నారు. రెడ్ కార్పెట్‌పై వయసు పైబడిన మహిళలను చూడటం మీకు అలవాటు లేకపోతే, ఇప్పటినుంచైనా ఆ అలవాటు మార్చుకోండి." అని అన్నారు.
అసలేం జరిగిందంటే..?
క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య రాయ్ దశాబ్దాలుగా హాజరవుతున్నారు. ఈ ఏడాది కూడా ఆమె తన ప్రత్యేకమైన, ప్రయోగాత్మక డ్రెస్సింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన శిల్పకళను తలపించే నీలం రంగు గౌన్ ధరించి ఆమె రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టారు. ఆమె స్టైల్‌ను, కాన్ఫిడెన్స్‌ను చాలామంది ప్రశంసించినప్పటికీ, కొంతమంది నెటిజన్లు మాత్రం ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ ఫ్యాట్ ఆంటీ అంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలోనే కంగనా ఆమెకు మద్దతుగా నిలిచి ట్రోలర్ల నోళ్లు మూయించారు.

