Naga Chaitanya: అఖిల్ నా దృష్టిలో ఎప్పుడో హీరో అయ్యాడు.. తమ్ముడిపై నాగచైతన్య ప్రశంసల వర్షం!
నాగచైతన్య ప్రశంసల వర్షం!

Naga Chaitanya: అక్కినేని అభిమానుల్లో ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడంతో అక్కినేని కుటుంబంతో పాటు ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ ఘన విజయం సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో అక్కినేని నాగచైతన్య పాల్గొని తన తమ్ముడు అఖిల్, తండ్రి నాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమ్ముడు అఖిల్‌పై నాగచైతన్య ప్రశంసలు!
ఈ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ అఖిల్ నటనను, ఆయన పడ్డ కష్టాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు."లెనిన్ విజయం సాధించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నిజానికి ఈ కథను అంగీకరించినప్పుడే అఖిల్ నా దృష్టిలో అసలైన హీరో అయ్యాడు. ఈ కథ వినగానే ఒక నటుడిగా నాకు భయం వేసింది. ఇలాంటి వైవిధ్యమైన పాత్ర చేయాలంటే కనీసం 25 సినిమాలు చేసిన అనుభవం ఉండాలి. కానీ, అఖిల్ కథను పూర్తిగా నమ్మి ముందడుగు వేశాడు. రియల్ లైఫ్‌లో అఖిల్ క్యారెక్టర్‌కు, ఈ సినిమాలో పాత్రకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ సినిమా కోసం తను ఎంత కష్టపడ్డాడో నేను స్వయంగా చూశాను. ఒక అన్నయ్యగా, అభిమానిగా అఖిల్‌ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది" అని నాగచైతన్య భావోద్వేగంగా చెప్పారు.
నాన్న నాగార్జున ధైర్యమే నాకు స్ఫూర్తి
నాన్న ఇంట్లో ఎలా ఉంటారో కేవలం నాకు, అఖిల్‌కే తెలుసు. ఆయన ఏదైనా ఒక విషయాన్ని సవాలుగా తీసుకుంటే ఎక్కడి దాకైనా వెళ్తారు. గతంలో 'మనం', 'బంగార్రాజు' సినిమాల సమయంలో ఆయనలో ఆ తపన చూశాను.. మళ్లీ ఇప్పుడు 'లెనిన్' టైమ్‌లో ఆ కసిని చూశాను. మొదట ఈ సినిమా కథ గురించి చెప్పినప్పుడు.. లవ్ స్టోరీలు ఎక్కువగా వస్తున్న ఈ సమయంలో ఇలాంటి కథను ప్రేక్షకులు ఆదరిస్తారా అని నాన్నను అడిగా. కానీ ఆయన 'నేను చేసి చూపిస్తా' అన్నారు. ఆయనలోని ఆ ధైర్యమే నాకు పెద్ద స్ఫూర్తి" అని చైతూ వెల్లడించారు.

