Akkineni Nagarjuna: సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండలేరని మరోసారి నిరూపితమైంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 'సురక్ష కా తిరంగా' ప్రత్యేక సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారాయి.

ఈ కార్యక్రమంలో నాగార్జున స్వయంగా తాను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినేనంటూ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. నాలుగేళ్ల క్రితం తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన వివరించారు. బ్యాంక్ అధికారి ముసుగులో ఓ సైబర్ కేటుగాడు తనకు ఫోన్ చేసి.. వ్యాపారంలో మంచి లాభాలొచ్చే స్టాక్స్, ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ అంటూ నమ్మించే ప్రయత్నం చేశాడని తెలిపారు. 'నాగార్జున గారు మీరు బిజినెస్‌లో చాలా స్మార్ట్.. మరి ఎందుకు ఇన్వెస్ట్ చేయడం లేదు?' అంటూ ఎంతో నమ్మకంగా మాట్లాడి మోసం చేయడానికి చూశాడని ఆయన గుర్తుచేసుకున్నారు.

కేవలం తనకే కాకుండా, తన బంధువు ఒకరు షూటింగ్ నిమిత్తం ఇరాన్ వెళ్లినప్పుడు కూడా ఇలాంటి ఘటనే ఎదురైందని నాగార్జున వెల్లడించారు. ఎయిర్‌పోర్టులో దిగిన కొద్దిసేపటికే గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులమంటూ ఫోన్ చేసి.. బ్యాగేజీలో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయంటూ భయపెట్టి డిజిటల్ అరెస్ట్ తరహాలో బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. అయితే బాధితురాలికి అవగాహన ఉండటంతో వెంటనే అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించిందని చెప్పారు.

ఈ అనుభవాల తర్వాత తాను సైబర్ భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటున్నానని నాగార్జున స్పష్టం చేశారు. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తన సోషల్ మీడియా, ఇతర ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చుకుంటానని చెప్పారు. వ్యక్తిగత భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల సోషల్ మీడియా వేదికగా అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టడంలో, సైబర్ భద్రతలో తెలంగాణ పోలీసుల కృషి అద్భుతమని కొనియాడారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story