నాగార్జునకు భారీ ఊరట..

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం కీలక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీలను ఉపయోగించి తన పేరు, స్వరం, ఫోటోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు వాడుకోవడాన్ని సవాల్ చేస్తూ నాగార్జున ఈ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ తేజస్ కారియా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

కోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలు ఇవే:

నాగార్జున నుంచి ముందస్తు అనుమతి పొందకుండా ఆయన పేరు, వాయిస్‌ను ఎలాంటి వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించకూడదు. AI, మెషిన్ లెర్నింగ్, డీప్‌ఫేక్స్ వంటి టెక్నాలజీల ద్వారా నాగార్జున గుర్తింపును దుర్వినియోగం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని కోర్టు స్పష్టం చేసింది. న్యాయ నిపుణులు ఈ తీర్పును మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సెలబ్రిటీల హక్కుల పరిరక్షణకు ఈ తీర్పు చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు.

నాగార్జున తరఫు వాదనలు

విచారణ సందర్భంగా నాగార్జున తరఫున సీనియర్ న్యాయవాదులు ప్రవీణ్ ఆనంద్, వైభవ్ గాగ్గర్, వైశాలి మిత్తల్ వాదనలు వినిపించారు. 95 చిత్రాల్లో నటించి, రెండు జాతీయ పురస్కారాలు అందుకున్న నాగార్జునకు సోషల్ మీడియాలో భారీగా అభిమానులు ఉన్నారని తెలిపారు. ఈ ప్రజాదరణను ఆసరాగా చేసుకుని కొందరు ఆయన గుర్తింపుతో నకిలీ వాణిజ్య ప్రకటనలు, అశ్లీల కంటెంట్, టీ-షర్టుల అమ్మకాలు వంటివి చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. యూట్యూబ్ షార్ట్స్‌లో హ్యాష్‌ట్యాగ్‌లు వాడి తప్పుడు వీడియోలను వైరల్ చేస్తున్నారని, ఇలాంటి కంటెంట్‌ను AI మోడల్స్ శిక్షణకు ఉపయోగిస్తే భవిష్యత్తులో మరింత ప్రమాదమని వాదించారు. న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, నాగార్జున వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా చూసేందుకు ఈ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story