Akshay Kumar: ఏఐ వీడియోలపై అక్షయ్ కుమార్ సీరియస్
అక్షయ్ కుమార్ సీరియస్

Akshay Kumar: మహర్షి వాల్మీకి వేషధారణలో బాలీవుడ్ సూపర్ స్టార్అక్షయ్ కుమార్ ఉన్నట్టుగా రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై అక్షయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఇవి పూర్తిగా నకిలీవని, తాను ఇలాంటివి చేయలేదని స్పష్టం చేశారు. "అందరికీ నమస్కారం. ఇటీవల సోషల్ మీడియాలో నేను మహర్షి వాల్మీకి పాత్రలో ఉన్నట్టుగా కొన్ని AI వీడియోలు ప్రచారంలో ఉన్నాయి. అవి పూర్తిగా నకిలీవి. వాటిని నేను సృష్టించలేదు లేదా వాటిలో నేను భాగం కాలేదు. దయచేసి వాటిని నమ్మకండి. షేర్ చేయవద్దు" అని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
అక్షయ్ కుమార్ ఇలాంటి ప్రకటన చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అతని పేరుతో కొన్ని నకిలీ ప్రకటనలు, వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. సైబర్ నేరగాళ్లు, గుర్తుతెలియని వ్యక్తులు AI టెక్నాలజీని ఉపయోగించి నటీనటులు, ప్రముఖుల ఫేక్ వీడియోలు సృష్టించడం ఇటీవల పెరిగిపోయింది. ఈ వీడియోల వల్ల ప్రముఖుల ప్రతిష్టకు భంగం వాటిల్లడమే కాకుండా, ప్రజలను మోసం చేయడానికి కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి. ఈ సంఘటన AI టెక్నాలజీ దుర్వినియోగం పట్ల ప్రజలు, ప్రముఖులు మరింత అప్రమత్తంగా ఉండాలని మరోసారి గుర్తుచేస్తుంది. ఇదిలా ఉండగా, అక్షయ్ కుమార్ ప్రస్తుతం సుభాష్ కపూర్ కోర్ట్ రూమ్ కామెడీ జాలీ LLB 3 లో కనిపిస్తున్నాడు, ఇది సెప్టెంబర్ 19 న థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే భారతదేశంలో రూ. 59 కోట్లకు పైగా వసూలు చేయగలిగింది.
