ఫిల్మ్‌ ఫెడరేషన్‌తో సమావేశం కానున్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి

సినీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌, తెలుగు సినీ నిర్మాతల మండలిల మధ్య వివాదం రోజు రోజుకీ ముదిరి పాకాన పడుతోంది. గడచిన ఏడు రోజులుగా సమ్మెబాట పట్టిన సినీ కార్మికులు నేడు సోమవారం నుంచి సినిమా షూటింగులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఫిలిం ఫెడరేషన్‌ ప్రకటించింది. వేతనాలు పెంపుకు సహకరించిన నిర్మాతల చిత్రీకరణ పనులు కూడా నిలిపేశారు. అయితే ఫెడరేషన్‌కు సహకరించకుండా షూటింగులు బంద్‌ చేయాలని నిర్మాతలకు శుక్రవారమే ఫిలిం ఛాంబర్‌ సూచించింది. మరీ ఎక్కువ కాలం షూటింగులు నిలిచిపోతే అటు నిర్మాతలు, ఇటు వేతనాలు లేక కార్మికులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సాంకేతిక బృందాలు, అద్దె పరికరాలు తీసుకుని ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం షూటింగులకు ఏర్పాటు చేసుకున్న నిర్మాతలపై విపరీతమైన ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. దీంతో ఇరువైపుల నుంచి పరిష్కారమార్గం కనుగొనడానికి కృషి చేయాలని సినీ పెద్దలు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈవ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం మొదలు పెట్టింది. ఈ రోజు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశానికి రావాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి ఫిల్మ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కు ఫోన్‌ వచ్చింది. కానీ ఫిల్మ్‌ ఛాంబర్‌ నుంచి మాత్రం తమకు ఎటువంటి పిలుపు రాలేదని అనిల్‌ చెపుతున్నారు. సమస్య పరిష్కారానికి తెలంగాన ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఈ పరిస్ధితుల్లో కొందరు నిర్మాతలు ఇక్కడ చర్చలు జరపకుండా విజయవాడ ఎందుకు వెళ్లారో అర్ధం కావడం లేదని ఫెడరేషన్‌ అధ్యక్షుడు అంటున్నారు. మేమైతే తెలంగాణ ప్రభుత్వానికి కట్టుబడి ఉంటామని, మంత్రి కోమటిరెడ్డిని కలిసి సమస్యపై చర్చిస్తామని, ఆయన సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ స్పష్టం చేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story