Ranveer Singh: బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. 'కాంతార' సినిమాలోని దైవ నర్తన హావభావాలను అనుకరించి వివాదంలో చిక్కుకున్న ఈ హీరో.. తాజాగా కోర్టు ఆదేశాల మేరకు మైసూరులోని ప్రసిద్ధ చాముండేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం అమ్మవారిని దర్శించుకున్న రణ్‌వీర్.. ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు.

అసలు ఏం జరిగిందంటే.. గతేడాది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో రణ్‌వీర్ సింగ్ స్టేజ్‌పై 'కాంతార' సినిమాలోని పంజుర్లి దైవ హావభావాలను ఇమిటేట్ చేశారు. ఇది కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసిందంటూ అప్పట్లో తీవ్ర వివాదం చెలరేగింది. దీనిపై రణ్‌వీర్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పినప్పటికీ.. ఆయన క్షమాపణల్లో నిజాయతీ లేదంటూ ఓ న్యాయవాది కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. పంజుర్లి, గులిగ దైవ వ్యక్తీకరణలను రణ్‌వీర్ అసభ్య రీతిలో అనుకరించారని, చాముండి అమ్మవారిని భూతంగా పేర్కొన్నారంటూ పిటిషన్‌లో ఆరోపించారు.

మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ రణ్‌వీర్ సింగ్ కూడా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఎవరినీ బాధపెట్టాలని తాను అలా చేయలేదని న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఆయన క్షమాపణలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. దానికి ప్రాయశ్చిత్తంగా నాలుగు వారాల్లోగా మైసూరు చాముండేశ్వరి దేవిని దర్శించుకోవాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన గడువు ముగిసే సమయానికి రణ్‌వీర్ సింగ్ మైసూరు చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story