Actress Kriti Sanon: అనుకోకుండా వచ్చిన మోడలింగ్ అవకాశమే నటిని చేసింది.. సినీ ప్రయాణంపై కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు
కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Actress Kriti Sanon: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తన నటనా రంగ ప్రవేశం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను అనుకోకుండా మోడలింగ్‌లోకి రావడం వల్లే, చివరికి సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు పడ్డాయని ఆమె స్పష్టం చేశారు. మొదట్లో తనకు మోడలింగ్ చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదని కృతి సనన్ తెలిపారు. "చాలామంది నన్ను చూసి మోడలింగ్ ప్రయత్నించమని సలహాలు ఇచ్చారు. సరే, ప్రయత్నిస్తే పోయేదేముంది.. ఒక కొత్త అనుభవం వస్తుందనే భావనతోనే మొదలుపెట్టాను. సరిగ్గా అదే సమయంలో నా సోదరి సరదాగా తీసిన కొన్ని ఫొటోలను పంపడంతో నన్ను మోడల్‌గా ఎంపిక చేశారు" అని ఆమె గుర్తుచేసుకున్నారు.
నాన్న వారించినా.. అమ్మ ప్రోత్సాహంతోనే ముందడుగు
మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టే సమయంలో ఇంట్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని కృతి వెల్లడించారు. "చదువులో చాలా చురుగ్గా ఉంటావు.. ఇలాంటి రంగంలోకి వెళ్తే చదువు దెబ్బతింటుంది, ఇదంతా అవసరమా?" అంటూ తండ్రి మొదట అభ్యంతరం చెప్పారు. అయితే తల్లి మాత్రం పూర్తి మద్దతుగా నిలిచారు. "ఫర్వాలేదు.. ఒప్పంద పత్రాలపై నేనే సంతకం చేస్తాను" అంటూ ముందుకు వచ్చి ప్రోత్సహించారని ఆమె తెలిపారు.
యాడ్స్ నుంచే నటి కావాలనే కోరిక
మోడలింగ్ మొదలుపెట్టిన తర్వాత వచ్చిన టీవీ కమర్షియల్స్ తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయని కృతి పేర్కొన్నారు. "యాడ్స్‌లో నటిస్తున్నప్పుడు.. నాలోనూ కొద్దో గొప్పో నటన దాగి ఉందనే నమ్మకం కలిగింది. ఆ ప్రక్రియను ఆస్వాదించడం మొదలుపెట్టాక, నటిని కావాలనే ఆశ నా మనసులో బలంగా నాటుకుపోయింది. అలా అనుకోకుండా వచ్చిన మోడలింగ్ అవకాశమే చివరికి నన్ను కథానాయికగా నిలబెట్టింది" అని కృతి సనన్ వివరించారు.

