Anasuya and Vishnupriya: పోలీసులకు ఫిర్యాదు చేసిన అనసూయ, విష్ణుప్రియ
అనసూయ, విష్ణుప్రియ

Anasuya and Vishnupriya: టాలీవుడ్ పాపులర్ సెలబ్రిటీలు అనసూయ, విష్ణుప్రియ సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు.తమను వేధిస్తున్న వారిపై శుక్రవారం పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఒకరు నేరుగా పోలీస్ స్టేషన్‌కెళ్లి కంప్లైంట్ ఇస్తే.. మరొకరు సోషల్ మీడియా వేదికగా పోలీసులను ట్యాగ్ చేస్తూ యాక్షన్ తీసుకోవాలని కోరారు.
తన గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఒక యూట్యూబ్ ఛానల్‌పై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో నేరుగా ఫిర్యాదు చేశారు యాంకర్ విష్ణుప్రియ. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "నా గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తి కూడా ఒక అమ్మాయే. అయినా ఇండస్ట్రీకి చెందిన మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. అందుకే ఆమెపై కంప్లైంట్ ఇచ్చా. ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు.. అందరిపైనా లీగల్ యాక్షన్ తీసుకుంటా" అంటూ విష్ణుప్రియ హెచ్చరించారు.
మరోవైపు, నటి అనసూయకు ఏఐ టెక్నాలజీతో పెద్ద సమస్య వచ్చి పడింది. తనను అసభ్యకర రీతిలో చూపిస్తూ కొందరు ఏఐ (AI) జనరేటెడ్ ఫొటోలను సృష్టిస్తున్నారంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్యాగ్ చేశారు అనసూయ. "సార్.. ఇలాంటి వాటిని పట్టించుకోకూడదని అనుకున్నా. కానీ ఈ ప్రొఫైల్ నుంచి తరచూ నా ఫేక్ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు" అంటూ ఆ అకౌంట్ లింక్‌ను షేర్ చేశారు. దీనిపై సీపీ సజ్జనార్ వెంటనే స్పందించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని.. దీనిపై సమన్వయం చేసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ అకౌంట్‌ను ట్యాగ్ చేశారు.

