Anirudh for RC17: రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తున్నారు. తాత్కాలికంగా RC17గా పిలుస్తున్న ఈ సినిమా నవంబర్ 1న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

సుకుమార్ కెరీర్‌లో సంగీత దర్శకుడి విషయంలో ఈ సినిమా ఒక కొత్త ప్రయోగంగా నిలవనుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా తన సినిమాలకు ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి పనిచేస్తున్న సుకుమార్, ఈసారి మరో సంగీత దర్శకుడితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఎంపికైనట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

దేవిశ్రీ ప్రసాద్‌తో కొనసాగకూడదని నిర్ణయించుకున్న తర్వాత సుకుమార్ మొదట ‘ధురంధర్’ సినిమాకు సంగీతం అందించిన శాశ్వత్ సచ్‌దేవ్‌తో కలిసి పనిచేయాలని భావించినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత అనిరుధ్ పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనిరుధ్ పేరును సుకుమార్‌కు సూచించింది రామ్ చరణేనని ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ సూచన తర్వాత సుకుమార్ కూడా అనిరుధ్‌తో కలిసి పనిచేసే విషయాన్ని పరిశీలించి, చివరకు ఆయనను ఈ సినిమాకు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే అనిరుధ్ ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారనే విషయంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. రామ్ చరణ్ సూచనతోనే ఆయన పేరు ఖరారైందనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రమే వినిపిస్తున్నాయి. దీనిపై సినిమా యూనిట్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Next Story