ఫ్యాన్స్‌కు అన్నా లెజ్నెవా రిప్లై

Anna Lezhneva: టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యంగా ఆయన సతీమణి అన్నా లెజ్నెవా గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. తాజాగా అన్నా లెజ్నెవా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్‌లో నెటిజన్లు అడిగిన అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆమె చాలా ఓపిగ్గా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయాలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ చిట్ చాట్ సెషన్‌లో నెటిజన్లు ఎక్కువగా అడిగిన ప్రశ్న.. పవన్ కళ్యాణ్‌తో ఆమె ప్రేమ కథ గురించి. "మీ ఇద్దరిలో మొదట ఎవరు ప్రపోజ్ చేశారు?" అన్న నెటిజన్ ప్రశ్నకు అన్నా లెజ్నెవా సిగ్గుపడుతూనే అసలు విషయాన్ని బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ తనకు మొదట ప్రపోజ్ చేశారని ఆమె క్లారిటీ ఇచ్చారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తెర మీద గంభీరంగా కనిపించే పవన్ కళ్యాణ్ లోని రొమాంటిక్ యాంగిల్‌ను అన్నా ఇలా బయటపెట్టడంతో ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ 'తీన్ మార్' సినిమా షూటింగ్ సమయంలో ఒకరినొకరు ఇష్టపడి, ఆ తర్వాత వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక అన్నా లెజ్నెవాకు ఎన్ని భాషలు వచ్చన్న విషయంపై కూడా క్లారిటీ వచ్చింది. తనకు మొత్తం ఆరు భాషలు తెలుసని ఆమె వెల్లడించారు. అయితే అన్ని భాషలు తెలిసినప్పటికీ, సంభాషించడానికి మాత్రం తనకు ఇంగ్లీష్ భాషలోనే చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. మరి తెలుగు గురించి ఏమంటారని అడగ్గా.. "నాకు తెలుగు అంటే చాలా ఇష్టం" అని ఆమె మురిసిపోయారు. ప్రస్తుతం తాను రోజూ కొద్దికొద్దిగా తెలుగు నేర్చుకుంటున్నానని, త్వరలోనే పూర్తిస్థాయిలో తెలుగులో మాట్లాడతానని ఆశాభావం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story