IBOMMA మళ్లీ వచ్చేసింది!

iBomma Is Back Again: ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమండి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి, వెబ్‌సైట్‌ను శాశ్వతంగా మూసివేయించడంతో సినీ పరిశ్రమ, నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. పైరసీపై పెద్ద విజయం సాధించామని సంబరపడుతున్న పోలీసులకు ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది. ఇమండి రవి అరెస్ట్, ఐ-బొమ్మ క్లోజ్ అయిన కొన్ని రోజుల్లోనే ఆన్‌లైన్‌లో 'iBOMMA 1' పేరుతో కొత్త వెబ్‌సైట్ ప్రత్యక్షమైంది. ఈ కొత్త వెబ్‌సైట్‌లోనూ సరికొత్త సినిమాలు కనిపిస్తుండడంతో సినిమా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. iBOMMA 1 వెబ్‌సైట్‌లోని ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే, అది వెంటనే మూవీ రూల్జ్ (Movie Rules) వంటి ఇతర ప్రముఖ పైరసీ వెబ్‌సైట్‌లకు రీడైరెక్ట్ అవుతోంది. రవి అరెస్ట్‌కు ముందే, అతని పైరసీ ఎకో సిస్టమ్‌లో దాదాపు 65 మిర్రర్ వెబ్‌సైట్‌లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ నెట్‌వర్క్‌లో భాగమైన వారే, అరెస్ట్ తర్వాత కూడా తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ iBOMMA 1 వెబ్‌సైట్‌ను ప్రచారంలోకి తీసుకొచ్చి ఉంటారని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. iBOMMA 1 మళ్లీ రావడంతో అప్రమత్తమైన పోలీసులు, కేవలం iBomma ఎకో సిస్టమ్‌పైనే కాకుండా, ఇప్పుడు మూవీ రూల్జ్, తమిళ్ MV సైట్లపైనా దృష్టి సారించి, వాటిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అరెస్టులు చేసినా, సైట్లు క్లోజ్ చేసినా... పైరసీ ఒక మనిషి కాదని, ఒక వ్యవస్థ అని, అది మరో పేరుతో తిరిగి పుట్టుకొస్తుందని ఈ తాజా పరిణామం రుజువు చేసింది. సినీ పరిశ్రమకు ఇది అతిపెద్ద సవాలుగా నిలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story